మల్కన్ గిరి ఎన్ కౌంటర్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. 40 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఇది అతిపెద్ద నష్టం అని చెబుతున్న మావోయిస్టులు నవంబర్ 3న బంద్ కు ఇప్పటికే పిలుపు ఇచ్చారు. పోలీసుల అధికారిక ప్రకటనల ప్రకారం ఆర్కే కోసం ఏవోబీ లో ఇంకా గాలింపులు జరుగుతున్నాయి. అయితే మావోల అధికారిక ప్రకటన ప్రకారం ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుస్తున్నది.
తాజాగా ఆర్కే భార్య హైకోర్టు లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని ఆమె కోరారు. ఆర్కే ఆచూకీ తెలియజేయాలని ఆమె పిటిషన్ లో కోరారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె పిటిషన్ ను హైకోర్టు విచారించబోతున్నట్లు సమాచారం.
అదే సమయంలో ఆర్కే పోలీసుల అడుపులోనే ఉన్నాడని ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంఘాలు అన్నీ ఆరోపిస్తున్నాయి. కొత్తగా వామపక్ష ముద్ర లేని తెలంగాణ ఉద్యమ కారుడు కోదండరాం కూడా ఇదే డిమాండ్ ను వినిపిస్తున్నారు. పోలీసులే అక్రమంగా ఆర్కే ను నిర్బంధించి ఉన్నారని , వెంటనే ఆయనను కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేస్తున్నారు.
మొత్తానికి ఆర్కే గురించిన సమాచారం తెలియకపోవడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.