అవును మరి పోటీచేసే పరిస్థితి లేదు!

Update: 2016-10-07 00:56 GMT

తెలంగాణలో గులాబీ పార్టీ ఖాతాలో మరొక విజయం నమోదు అయింది. అయితే ఇది వారికి రాజకీయంగా కొత్తగా పెరిగిన బలం కాదు. ఇదివరలో వారి ఖాతాలోనే ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే తిరిగి వారే దక్కించుకున్నారు. అందులో ఆశ్చర్యం లేదు. ఆ ఎన్నిక ఏకగ్రీవంగానే పూర్తయిపోయింది. అవును మరి.. అసలు ఆ ఎన్నికలో పోటీచేయడానికి తగిన పరిస్థితి కూడా ప్రత్యర్థులకు లేనప్పుడు మరేం జరుగుతుంది..

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా కొత్తగా ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడు ఫరీదుద్దీన్‌ ఎన్నికయ్యారు. ఇది ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయడం వలన ఏర్పడిన ఖాళీ. గతంలో తుమ్మలను మంత్రిచేసేసిన తర్వాత.. ఆయన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేస్థానానికి ఉప ఎన్నిక రావడంతో అక్కడ పోటీచేసి గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. అదే జిల్లాకు చెందిన ఫరీదుద్దీన్‌ ను తెరాస అభ్యర్థిగా నిలబెట్టింది.

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే.. బలాబలాలు ఎలా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ తమాషా ఏంటంటే.. గెలుపు లక్ష్యం కాకుండా, ఎన్నికల్లో పోటీకి దిగడం ద్వారా అధికార పార్టీ వక్రబుద్ధులను ఎండగట్టడమే లక్ష్యం అని చెప్పుకునే విపక్షాలు కూడా పోటీకి కనీసం ప్రయత్నించలేదు. కనీసం ఎవరైనా పోటీకి దిగి ఉంటే.. తుమ్మల తన రాజకీయ అవసరాలకోసం .. ఎమ్మెల్సీ స్థానాన్ని పావుగా, వాడుకున్నారని.. వారి గెంతుల వల్ల.. అనవసరంగా ఎన్నికల నిర్వహణ భారం పడుతున్నదని.. ఇలాంటి విమర్శలు చేసే అవకాశం వచ్చి ఉండేది. కానీ విపక్షాలు కనీసం పోటీ చేసే ఓపికకూడా కనపర్చకపోవడంతో.. ఫరీదుద్దీన్‌ ఏకగ్రీవంగా గెలిచారు.

ఆయన గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిసి., అభినందనలు అందుకున్నారు.

Similar News