చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలితను రాహుల్ గాంధీ శుక్రవారం పరామర్శించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో ఆస్పత్రి వైద్యులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ రాక సందర్భంగా అపోలో ఆస్పత్రి వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
జయ లలిత ఒకప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నారు. తర్వాత వారి నుంచి విడిపోయి స్వతంత్రంగానే ఉన్నారు. కేంద్రంలో ఏ కూటమిలోనూ భాగంగా లేకుండా అన్నా డీఎంకే ను నిర్వహిస్తున్నారు. జయలలిత వెళ్లిపోయాక.. కాంగ్రెస్ కూటమిలోకి డీఎంకే ప్రవేశించింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వారు కూడా కూటమినుంచి బయటకు వచ్చి , అంశాలవారీ మద్దతు మాత్రమే ఇచ్చారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు కలిసే పోటీచేశాయి.
మొత్తానికి ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్న జయలలితను పరామర్శించడానికి రాహుల్ గాంధీ రావడం ఆసక్తి కర పరిణామమే. మామూలుగా ఇది విశేషం కాకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆమె పరిస్థతి తీవ్రంగా ఉండడం, కొన్ని రోజులుగా ఎవ్వరినీ అనుమతించకపోవడం, చివరికి ఆమె దత్తపుత్రుడు సుధాకరన్ ను కూడా లోనికి రానివ్వకపోవడం.. ఇలాంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ వచ్చి పరామర్శించడం అనేది కీలకంగా ఉంది.