అంతా గులాబీలే: తెగ కొట్టేసుకున్నారు

Update: 2016-10-31 12:48 GMT

కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయింది. ప్రతి కొత్త జిల్లాకు కొత్తగా కమిటీలను ఏర్పాటు చేయడం, కొత్త జిల్లాలకు నాయకత్వాలను నిర్ణయించే పనిలో పార్టీలన్నీ నిమగ్నమై ఉన్నాయి. ఇలాంటి కీలక పదవుల కోసం అధికార పార్టీలో సహజంగానే పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే అంతా గులాబీ శ్రేణులే.. అభిప్రాయ భేదాలతో పార్టీ నాయకులు, పోలీసుల ఎదుటనే ఎగబడి కొట్టేసుకోవడం జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో జరిగింది.

జోగులాంబ గద్వాల జిల్లా చివరి విడతలో కేసీఆర్ అనేక సమీక్షల తర్వాత ఏర్పడిన జిల్లా. నిజానికి మొత్తం తెలంగాణలో తెరాసకు అంతో ఇంతో బలం తక్కువగా ఉన్న జిల్లాల్లో పాత పాలమూరు జిల్లా కూడా ఒకటిగా చెప్పేవారు. విపక్షాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో గెలుపొందడమే ఇందుకు కారణం.

అయితే ఈ రెండున్నరేళ్లలో కేసీఆర్ సర్కారు తమ ప్రభుత్వానికి జనాదరణ పెరిగిందని పదేపదే చెప్పుకుంటోంది. వారు చెప్పుకోవడం సంగతి ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల మనోగతం కూడా అలాగే ఉన్నట్లుంది. జనంలో ఉండే కార్యకర్తలు తమ పార్టీ బలం పెరుగుతున్నదని నమ్ముతున్నట్లుగా ఉన్నారు. అందుకే , కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారిగా జరిగిన జోగులాంబ గద్వాల జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఒక దశలో పోలీసులు వచ్చి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

Similar News