అప్పుడు..ఆ ఇద్దరూ.. ఇప్పుడు ఈ ఇద్దరూ.. విమర్శలకేనా?
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాటు జగన్ సీఎంగా ఉన్నారు
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాటు జగన్ సీఎంగా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కయ్యారని, జగన్ తో లాలూచీపడి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపించింది. ఇప్పుడు ముఖ్యమంత్రులు మారినా అదే విమర్శ మళ్లీ వినపడుతుంది. ఈసారి తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండగా, ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు. కృష్ణానది నీటిని ఏపీ తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదని అప్పడూ..ఇప్పడూ ఆరోపణలు ఒక్కటే. దీనికి ముఖ్యమైన కారణం ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సాన్నిహిత్యమే కారణమని చెప్పకతపపదు. అదే విపక్షాలకు వరంగా మారిందని చెప్పాలి.
కేసీఆర్.. జగన్...
నిజమే.. ప్రజల్లో అనుమానాలు కలగడానికి కూడా ఇవే కారణం. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లి వచ్చారు. తర్వాత ఇద్దరి మధ్య బంధం బలపడింది. జగన్ కూడా ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ తో ముచ్చటించారు. కేటీఆర్ కూడా జగన్ సీఎం కాక ముందు ఆయన నివాసానికి వెళ్లి మాట్లాడి వచ్చారు. ఇలా ఈ ఇద్దరి మధ్య సఖ్యత అనేది బాగా ఉందని అందరికీ తెలిసిందే. బహిరంగ రహస్యమే. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉండటాన్ని ఎవరూ తప్పుపట్టడానికి వీలులేదు. కానీ దానిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ విపక్షాలు ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి ఎన్నికల్లోనూ జగన్ గెలుస్తారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
రేవంత్, చంద్రబాబు...
ఇక 2023 ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ రాగా, 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. రెండు ప్రభుత్వాలకు సారూప్యత లేదు. అయితే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే కావడంతో పాటు ఆయన రాజకీయ గురువు అని భావించే చంద్రబాబుతో లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెడుతున్నారని ప్రస్తుత బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కొంతకాలం క్రితం చంద్రబాబు కూడా వచ్చి రేవంత్ రెడ్డితో సమావేశమై రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించి వెళ్లారు. అయితే ఇద్దరి పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి రాష్ట్రం వారికి కావాలి. జగన్ కోసం కేసీఆర్, చంద్రబాబు కోసం రేవంత్ లు రాష్ట్రాన్ని పణంగా పెట్టరు.
నలుగురిలో ఏ ఒక్కరూ...
ఎందుకంటే ఏమాత్రం నలుగురి లో ఏ ఒక్కరు రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టినా ప్రజలు రాజకీయ సమాధి కట్టేస్తారని తెలయని నేతలు కాదు. కృష్ణా నదిని తరలించుకుపోతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకుండరు. అలాగే రేవంత్ రెడ్డి కూడా మౌనంగా ఉండరు. ఖచ్చితంగా పోరాడతారు. కేఆర్ఎంబీ ఒకటి ఉంది. అది నిర్ణయించిన మేరకే నీటి వాటాలుంటాయి తప్పించి ఎవరిష్టం వారు నీటిని తోడుకుపోయే అవకాశం ఉండదు. కానీ రాజకీయాలకు ఇవన్నీ అనవసరం. ఎవరు విపక్షంలో ఉన్నప్పటికీ ఈ ఆరోపణలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలి. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఎవరున్నా సఖ్యతగానే ఉంటూ ఇరురాష్ట్రాల రైతుల, ప్రజల కు సాగు,తాగునీరు అందించగలగాలి. అదే కదా? ఎవరైనా కోరుకునేది. అందుకే విపక్షాలు విమర్శలు మాని సహేతుకమైన సూచనలు చేస్తే బాగుంటుంది.