Tirumala : తిరుమలకు వెళ్లే వారు నేడు స్వామి వారిని సులువుగానే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత మూడు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. తక్కువ సంఖ్యలో కంపార్ట్ మెంట్లలోనే శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటున్నారు. సోమవారం నుంచి భక్తుల రద్దీ తక్కువగా ఉంది. అయితే రేపటి నుంచి భక్తుల రద్దీ ఎక్కువయ్యే అవకాశాలున్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు అయితే స్వామి వారిని భక్తులు సులువుగానే దర్శనం చేసుకుంటున్నారు.
హుండీ ఆదాయం కూడా...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వస్తుందని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమలకు భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. టీటీడీ దేశ వ్యాప్తంగా నిర్మించిన వెంకటేశ్వరస్వామి ఆలయాల ప్రభావం కూడా ఈ దర్శనం చేసుకోవడానికి కారణమయిందని చెబుతున్నారు. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం భక్తుల రద్దీతో సంబంధం లేకుండా వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
తొమ్మిది కంపార్ట్ మెంట్లలో
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్ీరవారిని 68,586 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,764 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారిహుండీ ఆదాయం 3.71 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.