Telangana : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తొందరపడిందా?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి

Update: 2026-02-05 12:38 GMT

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన మద్దతు తీసుకోవడం ఒక రకంగా గెలిచే మున్సిపాలిటీ ఫలితాలపై కూడా ఈ ప్రభావం చూపుతుందని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే బీజేపీతో పొత్తుతో ఉన్నారు. అంత వరకూ ఓకే. కానీ ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ ను ఇప్పుడు ఇతర పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకునే అవకాశాలున్నాయి. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు తెలంగాణలో క్యాడర్ లేదు. ఓటు బ్యాంకు కూడా లేదు. సినిమా అభిమానం వేరు. పవన్ ను అభిమానించే యువకులు సయితం తెలంగాణలో ఏదో ఒక పార్టీ పట్ల సానుకూలతతో ఉంటారు. అందులో బీజేపీ కూడా ఉండొచ్చు.

దిష్టి వ్యాఖ్యలతో...
పైగా ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ ఇక్కడి కొబ్బరి తోటలు ఎండి పోవడానికి కారణం దిష్టి అని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కోనసీమ పచ్చటి అందాలని, కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వారి దిష్టి తగిలిందన్న అర్థం వచ్చే రీతిలో వ్యాఖ్యానించారు. జనసేన, బీజేపీకి మద్దతిస్తుందని, పవన్ కల్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని ప్రకటన వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు. సాక్షాత్తూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పవన్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల ఓట్ల కోసం రావడమేంటని అన్నారంటే మరొకసారి సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేసినట్లయింది.
బీజేపీ బలంగా ఉన్నా...
రాష్ట్రం విడిపోయినప్పుడు తాను తిండి తినలేదని, నిద్రపోలేదన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కూడా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బీజేపీ తెలంగాణలో బలంగా ఉంది. గత పార్లమెంటు ఎన్నికలలో ఎనిమిది స్థానాల్లో గెలిచింది. అలాంటి బీజేపీ ఇప్పుడు పవన్ కల్యాణ్ వచ్చి ప్రచారం చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో నష్టం వాటిల్లకతప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పట్టణాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ అంతగా ఉండదని భావించి కమలం పార్టీ పవన్ ను రంగంలోకి దించినప్పటికీ సెంటిమెంట్ ను ప్రత్యర్థులు తీసుకెళితే తీవ్రంగా నష్టపోయే అవకాశముందన్న హెచ్చరికలు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తుండటం విశేషం. బీజేపీ తన సొంత పంథాలోనే వెళితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని, ఇలా ఏపీకి చెందిన నేతల సహకారం తీసుకుంటే లబ్ది కంటే నష్టమే ఎక్కువని అంటున్నారు.


Tags:    

Similar News