India vs South Africa : దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం.. వార్మప్ మ్యాచ్ తో బోణీ
టీ20 ప్రపంచకప్ కు ముందు సన్నాహక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది
టీ20 ప్రపంచకప్ కు ముందు సన్నాహక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. 30 పరుగుల విజయంతో వార్మప్ మ్యాచ్ లోనూ శుభారంభం చేసింది. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ వార్మప్ మ్యాచ్ లోఇషాన్ కిషన్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ విధ్వంసకర అర్ధశతకం భారత్‌కు దక్షిణాఫ్రికాపై 30 పరుగుల గెలుపు తెచ్చిపెట్టింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ను ఎంచకుంది. ఇషాన్ కిషన్ కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు సిక్సులు, రెండు ఫోర్లు ఉన్నాయి. పవర్‌ప్లేలో అభిషేక్ శర్మ 24 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఇద్దరు కలిసి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
భారీ పరుగులు చేసి...
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అమెరికాతో వాంఖడేలో అభిషేక్‌తో కలిసి ఇషాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం నుంచి తిరిగొచ్చిన తిలక్ వర్మ 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ 35, హార్దిక్ పాండ్యా 10 బంతుల్లో 30 పరుగులు చేసి చివరి ఓవర్లలో వేగం పెంచారు. రింకూ సింగ్ హెల్మెట్‌కు బంతి తగిలినా 16 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఇరవై ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 240 పరుగుల చేసింది.
ఛేదనలో దక్షిణాఫ్రికా...
ఈ వార్మప్ మ్యాచ్ లో భారత్ మొత్తం తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించింది. అభిషేక్ శర్మ 3 ఓవర్లలో 32 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్ తొలి వికెట్ తీశాడు. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. హర్షిత్ రాణా ఒకే ఓవర్ వేశాడు. దక్షిణాఫ్రికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.జార్జ్ లిండే ఓపెనర్‌గా ప్రయోగం విఫలమైంది. రాయన్ రికెల్టన్ 44, జేసన్ స్మిత్ 35 పరుగులు చేశారు. ట్రిస్టన్ స్టబ్స్ 21 బంతుల్లో అజేయంగా 45 పరుగులు చేసినా జట్టు లక్ష్యానికి చేరలేదు. దీంతో ఇరవై ఓవర్లకు దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ దక్షిణాఫ్రికాపై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.