YSRCP : ఫ్యాన్ కు మూడు రెక్కలు.. వైసీపీలో మూడు వర్గాలు.. నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించాలి

Update: 2026-02-05 09:08 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించాలి. తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వచ్చి కలసి ఫొటోలు దిగి స్టేటస్ గా పెట్టుకున్న వారికే పదవులు ఇవ్వకుండా గ్రామాల్లో ఎవరు నిజంగా కష్టపడుతున్నారు? ఎవరికి జనంలో బలం ఉందన్నది చూడాలి. అది తెలుసుకోవాలంటే కేవలం కోటరీమీదనో.. స్థానిక నాయకుల మీదనో ఆధారపడితే మళ్లీ చరిత్ర పునరావృతమవుతుంది. ఎందుకంటే నాడు జరిగిన తప్పులే మళ్లీ జరగకుండా ఉండాలంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెరగాలని కోరుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి జగన్ ను తాడేపల్లి కార్యాలయానికి కలవడానికి వచ్చిన వాళ్లకు ఇప్పటికీ జగన్ అపాయింట్ మెంట్ దొరకడం లేదు.

బయటకు వెళితే భారీగానే...
జగన్ బయటకు వెళితే కార్యకర్తలు బాగానే వస్తున్నారు. వారు వస్తున్నది కూడా యాభై శాతం జగన్ మీద అభిమానం అయితే..మిగిలిన యాభై శాతం స్థానిక నాయకుల మీదన్న విషయం గుర్తుంచుకోవాలంటున్నారు. వైసీపీలో లో ఎప్పుడు నిజంగా కష్టపడే వాడికి ఫలితం దక్కేది ఎప్పుడంటూ సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలోనూ రెండు మూడు వర్గాలున్నాయి. మాజీ ఎంపీ వర్గం, మాజీ ఎమ్మెల్యే వర్గం, జగన్ కి వ్యక్తిగత పరిచయం అని చెప్పుకునే మరొక వర్గం ఇలా మూడు గ్రూపులుగా అన్ని గ్రామాల్లో విడిపోయి తమ వర్గాల వారికి పదవులు ఇప్పించుకోవడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.
పార్టీ పదవుల నియామకాల్లో...
పార్టీ పదవుల నుంచి అన్నీ వారు చెప్పిన వారికే నాయకత్వం కూడా ఇస్తుండటంతో అసలైన, సిసలైన కార్యకర్త మాత్రం డీలా పడిపోయాడు. నియోజకవర్గ పదవులు వేసే క్రమంలో మూడు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో మూడు గ్రూపులుగా విడిపోయి నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. జగన్ వచ్చినప్పుడు అందరూ కలసి కట్టుగా కనిపిస్తున్నా ఆ తర్వాత మాత్రం ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలని అనుకున్న దానికి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. కార్యకర్తల అభీష్టాన్ని తెలుసుకొని ఇస్తే ప్రజాస్వామ్య బద్ధంగా ఎంపిక చేస్తే ఫలితం ఉంటుంది. అంతే తప్ప ఎవరో సిఫార్సుతో పదవులు ఇస్తే పార్టీ అధికారంలోకి రావడం కష్టమే. ఇప్పటికైనా జగన్ తెలుసుకోవాలి.


Tags:    

Similar News