Andhra Pradesh : తిరుమల లడ్డూను వదలరా...రాజకీయ ప్రయోజనాలే లక్ష్యమా?

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందా? అన్నది పక్కన పెడితే భక్తుల మనోభావాలతో మాత్రం రాజకీయ నేతలు ఆటాడుకుంటున్నాయి.

Update: 2026-02-05 07:00 GMT

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందా? అన్నది పక్కన పెడితే భక్తుల మనోభావాలతో మాత్రం రాజకీయ నేతలు ఆటాడుకుంటున్నాయి. ఏడు కొండల వాడితో గేమ్స్ ఇప్పటి నుంచి కాదు దాదాపు ఏడాదిన్నర క్రితమే ప్రారంభమయింది. పాలకులయినా.. ప్రతిపక్షమయినా భక్తుల మనోభావాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలు నేడు వస్తాయి. లేకుంటే రావు. అంతే తప్ప కొన్ని వందల దశాబ్దాల నాటి చరిత్ర ఉన్న తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో మాత్రం పాలక, ప్రతిపక్షాలు భక్తులను పట్టించుకోకుండా రాజకీయ పరమావధిగానే ప్రయాణం చేస్తున్నాయి. ఒక రకంగా ఏడుకొండల వాడిని ఓట్లు తెచ్చి పెట్టే ఒక సాధనంగా భావిస్తున్నాయనుకోవచ్చు.

వివాదాలు చేయవద్దని చెప్పినా...
నిజానికి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఎలాంటి వివాదాలు చేయవద్దని, ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే ఒకిరిని మించి మరొకరు ఈ లడ్డూ ప్రసాదం విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు. ఈ వివాదాన్ని సిట్ ఛార్జిషీట్ తర్వాత వదిలేస్తే సరిపోయేది. కానీ దానిని పట్టుకుని లాగినంత మాత్రాన దక్కే ప్రయోజనం మాత్రం ఎవరికీ ఉండకపోవచ్చు. తిరుమల లడ్డూ తయారీ 350 ఏళ్లకు పైగానే సాగుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ లడ్డూ తయారీలో మాత్రం కల్తీ చేయడానికి సాహసించవు. కావాలంటే వేరే మార్గంలో డబ్బులు దండుకునే మార్గం చూసి ఉండవచ్చు కానీ, భక్తులకు అందించే ప్రసాదంలో మాత్రం అటువంటి నీచ చర్యలకు ఎవరూ పాల్పడరు. చివరకు సరఫరా చేసే కంపెనీలు సయితం లాభాపేక్షతో పాటు ఆధ్యాత్మికతతో ఉంటాయన్నది వాస్తవం.
రద్దీ ఏమైనా తగ్గిందా?
​సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని, సీబీఐ పర్యవేక్షణలో సిట్ విచారణ జరుపుతుంటే, దానికి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం మరో విచారణ కమిటీని వేయడం అంటే దీనిని లాగేందుకే పాలక పక్షం సిద్ధమయింది. ​కల్తీ జరిగింది అనేది వాస్తవమే అని సిట్ చార్జిషీట్ లో పేర్కొంది. అది సింథటిక్ నెయ్యి అని, అందులో చుక్క పాలు గానీ మీగడ గానీ లేవని తేలింది. అదొక ఘోరమైన నేరం అనడంలో సందేహం లేదు. అయితే ఆ నేరస్తులను శిక్షించడానికి సిట్ నివేదిక సరిపోతుంది. మళ్లీ కమిటీ వేసి సుదీర్ఘంగా సాగదీయడమే పనిగా పాలకపక్షం పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. అంటే ప్రజలు నమ్మడం లేదనే అనుకోవాల్సిందని గుర్తుంచుకోవాలి. సిట్ నివేదిక ప్రకారం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, అంతే తప్ప ఇక సాగదీయడం శ్రేయస్కరం కాదన్నది గుర్తుంచుకోవాలి.


Tags:    

Similar News