Jana Sena : జనసేనకు నేతలు దూరమవుతున్నారా? నాయకత్వమే కారణమా?

జనసేనలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న అంచనాకు వచ్చి ఒక్కొక్కరు నేతలు బయటకు వెళుతున్నారు

Update: 2026-02-05 07:59 GMT

అధికారంలో ఉన్న పార్టీలో కొనసాగాలని ఎవరైనా చూస్తారు. కానీ విచిత్రమేంటంటే జనసేనలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న అంచనాకు వచ్చి ఒక్కొక్కరు నేతలు బయటకు వెళుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవతున్నప్పటికీ తమను నాయకత్వం పట్టించుకోవడం లేదన్న భావన వారిలో వ్యక్తమవుతుంది. అందుకే వరసగా వెళ్లిపోతున్నారు. అయినా ఎవరు వెళ్లినా తనకు ఇబ్బంది లేదని, తన సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి ఉన్నవారు మాత్రమే ఉండవచ్చని పవన్ కల్యాణ్ తెగేసి చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా కేవలం తన ఛరిష్మాపైనే ఆధారపడి గెలుపోటములు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నట్లుంది. జగన్ తరహాలోనే తన బొమ్మ మాత్రమే గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.

మాట్లాడే ప్రయత్నం...
అందుకే నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నా వారిని పిలిచి మాట్లాడే కనీస ప్రయత్నం కూడా పార్టీ నాయకత్వం చేయడం లేదు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక నేత పార్టీని నుంచి బయటకు వెళ్లిపోయారు. తాజాగా విశాఖకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాత్కాలిక విరామమేనని, తాను పర్యావరణంపై ఉద్యమం చేయాల్సి ఉన్నందున అది పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశమున్నందున తాను పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెబుతున్నారు. కానీ బొలిశెట్టి తొలి నుంచి పార్టీలో ఉన్న నేత. విశ్రాంత అధికారి. సబ్జెక్ట్ పై అవగాహన ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజీనామా చేసినప్పుడు కనీసం పిలిచి మాట్లాడాల్సిన నాయకత్వం పట్టించుకోవడం లేదు. అంతకు ముందు బొలిశెట్టి నామినేటెడ్ పదవుల్లో జనసేనకు అన్యాయం జరుగుతుందని కూడా ప్రకటించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో...
ఇక పవన్ కల్యాణ్ ను కలిసేందుకు అవకాశం లేదు. అసలు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎవరిని కలిసి తమ గోడు చెప్పుకోవాలో తెలియదు. గతంలో నాదెండ్ల మనోహర్ ఈ పనులు చక్కబెట్టేవారు. ఆయన కేబినెట్ లో తలమునకలుగా ఉండటంతో పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. ఇక రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను కొందరిని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టినా ఎవరికెంత ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిపై వారికి స్పష్టత లేకపోవడం, వారు చెప్పిన విషయాలు, తెలిపిన సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో జనసేన క్యాడర్ డల్ అయింది. అమలాపురం, రాజోలు ఇంకా చాలా చోట్ల సమస్యలు అలానే వున్నాయి. పాలకొల్లు ఇన్ ఛార్జి లేడు. 30 వేలకు పైచిలుకి ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు ఇప్పటికి లేరు. ఇలాగయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఎలా నెగ్గుకు వస్తుందన్న ఆందోళన అందరిలోనూ కనపడుతుంది.


Tags:    

Similar News