ఆపరేషన్ మంగళగిరి... మొదలయిందా?

వైఎస్ జగన్ టీడీపీలో ఆపరేషన్ ప్రారంభించినట్లే కనపడుతుంది. పార్టీ కీలక నేతలను టీడీపీకి దూరం చేేసే ప్రక్రియ మొదలుపెట్టారు

Update: 2022-08-12 03:16 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ టీడీపీలో ఆపరేషన్ ప్రారంభించినట్లే కనపడుతుంది. పార్టీ కీలక నేతలను టీడీపీకి దూరం చేేసే ప్రక్రియ మొదలుపెట్టారు. తొలుత మంగళగిరిలో మెయిన్ వికెట్ ను పడగొట్టేశారు. వచ్చే ఎన్నికల్లోనూ నారా లోకేష్ ను ఓడించడమే జగన్ టాస్క్ గా పెట్టుకున్నట్లు కనపడుతుంది. ఒకవైపు కుప్పంపై ఫోకస్ పెడుతూనే మరో వైపు చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేయనున్న మంగళగిరి నియోజకవర్గంపై కూడా దృష్టి పెట్టారు. తాజాగా టీడీపీ నుంచి గంజి చిరంజీవి పార్టీ నుంచి బయటకు రావడమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. కుప్పంలో స్థానిక సంస్థలన్నింటిలో విజయం సాధించేలా చేసి చంద్రబాబును అటు వైపునకు పరుగులు తీయించారు.

నారా లోకేష్ పోటీ...
ఇప్పుడు నారా లోకేష్ వంతయింది. ఎప్పటి నుంచో మంగళగిరిపై జగన్ ఫోకస్ పెట్టారు. రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న నియోజకవర్గం కావడంతో ఆయన కళ్లన్నీ దానిపైనే ఉన్నట్లు కనపడుతుంది. మంగళగిరి టౌన్ లో యాభై వేల మంది వరకూ పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లున్నారు. వీరు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం అవుతుంది. తాడేపల్లి మండలంలో రెడ్డి సామాజికవర్గం ఎక్కువ. పద్మశాలిలను తమ వైపునకు తిప్పుకుంటే మరోసారి లోకేష్ ను సులువుగా ఓడించవచ్చన్న వ్యూహంలో జగన్ ఉన్నారు.
వారికి కీలక పదవులు...
పద్మశాలి నేత చిల్లపల్లి మోహన్ రావుకు ఆప్కో ఛైర్మన్ పదవి జగన్ ఇచ్చారు. ఇక అదే సామాజికవర్గానికి చెందిన మురుగుడు హన్మంతరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇది అప్పట్లో ఎవరూ ఊహించను కూడా లేదు. చేనేత సామాజికవర్గానికి చెందిన మురుగుడు హన్మంతరావుకు పదవి ఇవ్వడంతో కొంత పద్మశాలిలను జగన్ తన వైపునకు తిప్పుకున్నారు. ఇక తాజాగా గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరతారన్నది సస్పెన్స్ అయినా చివరకు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారన్న టాక్ నడుస్తుంది.
ఆయనకు కండువా కప్పేసి....
వచ్చే ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేయడం కష్టమే. ఆయన గత ఎన్నికలలోనే తాను పోటీ చేయనని జగన్ కు నేరుగా చెప్పారు. చివరి నిమిషంలో ఆళ్ల మనసు మార్చుకుని బరిలోకి దిగారు. 2014 ఎన్నికలలో ఆళ్ల రామకృష్ణారెడ్డిపైన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంజి చిరంజీవి కేవలం 14 ఓట్లతోనే ఓటమి పాలయ్యారు. ఆయనను పార్టీలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆళ్ల పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోయినా గంజి చిరంజీవి స్ట్రాంగ్ కాండిడేట్ వైసీపీకి అవుతారు. అందుకే గంజి చిరంజీవిని త్వరలోనే వైసీపీలో చేర్చుకుని ఆయనకు నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. మొత్తం మీద జగన్ ఆపరేషన్ మంగళగిరిని జగన్ ప్రారంభించినట్లే కనపడుతుంది.


Tags:    

Similar News