Nagababu : నాగబాబు గారూ ట్వీట్లతో ఓట్లు రాలవండీ

జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఇప్పటికీ రాజకీయంగా అనుభవం సంపాదించలేదు

Update: 2026-03-17 08:55 GMT

జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఇప్పటికీ రాజకీయంగా అనుభవం సంపాదించలేదు. ఆయన ట్వీట్లతో కాలం వెళ్లదీస్తున్నారు. అంతే తప్ప క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందన్న విషయాన్ని తన సోదరుడు, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ నాగబాబును రాజకీయాల్లోకి, తన పార్టీలోకి తీసుకు వచ్చిందీ తనకు అండగా ఉంటారని. అందుకే నాగబాబు ఎమ్మెల్సీని చేశారు. మంత్రి పదవి ఇద్దామని భావించినప్పటికీ తర్వాత ఆ ప్రతిపాదన వెనక్కు వెళ్లినట్లే కనిపిస్తుంది. అయితే నాగబాబు తన సోదరుడు పవన్ కల్యాణ్ కు చేదోడు వాదోడుగా ఉండట మంటే ట్వీట్లు పెట్టడం కాదు.

వాస్తవ పరిస్థితులను...
పార్టీలో జరుగుతున్న వాస్తవ విషయాలను పవన్ దృష్టికి తీసుకెళ్లాలంటున్నారు. పవన్ కల్యాణ్ తో అనేక మంది నేతలకు సానిహిత్యం ఉన్నా అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం వేరుగా ఉంటుంది. వాస్తవ పరిస్థితులు తెలియజేసి పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించాలంటే అందుకు నాగాబాబు కృషి కూడా అవసరం. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, వివిధ శాఖల పర్యవేక్షణలో ఆయన బిజీగా ఉండవచ్చు. ఆయనకు వచ్చే ఫీడ్ బ్యాక్ లో కొన్ని పొరపాట్లు ఉండవచ్చు. అంతేకాదు నేతలను, కార్యకర్తలను కలసుకునే అవకాశం.. సమయం కూడా పవన్ కల్యాణ్ కు ఉండకపోవచ్చు.
నేరుగా మాట్లాడే అవకాశం...
కానీ ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు క్యాడర్ తో నేరుగా మాట్లాడే అవకాశముంది. ద్వితీయ శ్రేణి నేతలను పిలిపించి నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకునే వీలు కూడా ఉంది. అంత సమయం కూడా నాగబాబుకు ఉంటుంది. కానీ నాగబాబు మాత్రం మరో ఇరవై ఐదేళ్లు కూటమి అధికారంలో ఉంటుందని చెబుతూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి, వాస్తవంగా పార్టీ డ్యామేజీ అవుతున్న పరిస్థితులను సోదరుడు పవన్ కల్యాణ్ కు వివరించడం లేదని జనసైనికులే అంటున్నారు. అలాంటప్పుడు నాగబాబు ఆ పదవిలో ఉండటం ఎందుకు అని కూడా కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జనసేన భవిష్యత్ కోసమైనా నాగబాబు నడుంబిగించి రియాలిటీని పవన్ కు తెలియజేయాలని కోరుతున్నారు.


Tags:    

Similar News