Putta Mahesh : రంగంలోకి దిగిన ఏపీ ఇంటలిజెన్స్.. పుట్టా మహేశ్ విషయంలో ఆరా

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.

Update: 2026-03-17 06:58 GMT

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించి విషయం తెలిసిందే. అయితే ఈ కేసుసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ప్రమేయంపై ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం లోతుగా దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. పుట్టా మహేశ్ నిజంగా డ్రగ్స్ తీసుకున్నాడా? తెలంగాణ పోలీసుల వాదనలో నిజమెంత? అసలు పుట్టా మహేష్ అక్కడకు ఎందుకు వెళ్లారన్న దానిపై ప్రధానంగా విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.

నిందితులతో ఉన్న సంబంధాలు...
ప్రధాన నిందితులతో పుట్టా మహేశ్ కు ఉన్న సంబంధాలు, డ్రగ్స్ పార్టీలు, ఇతర లావాదేవీలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు లోతైన విచారణ చేయాలని చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగారు. ప్రధానంగా డ్రగ్స్ నెట్వర్క్ ఎంపీకి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందులోభాగంగా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టి చంద్రబాబుకు త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారని తెలిసింది. డ్రగ్స్ కేసు ఎంపీ పుట్టా మహేష్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. మరోవైపు ఈ కేసు అంశాలు ఎంపీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఘటనలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీతో పాటు ప్రభుత్వంపై ప్రభావం చూపడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు.
సీనియర్ నేతల వారసత్వమే...
సీనియర్ నేతల వారసత్వమే పుట్టా మహేష్ అర్హత. అంతకు మించి ఏమీ లేదు. పుట్టా మహేశ్ వారసత్వమే అర్హతగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు ఎంపీగా టిక్కెట్ కేటాయించడంలో బలమైన రాజకీయ వారసత్వం, సీనియర్ నేతల అండదండలు కీలక పాత్ర పోషించాయి. ఆయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉండటం ఆయనకు కలసి వచ్చింది. పుట్టా మహేశ్ కు కేవలం తన తండ్రి వారసుడిగానే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దిగ్గజ నేతగా పేరొందిన యనమల రామకృష్ణుడికి అల్లుడు కావడం ఆయన రాజకీయ బలాన్ని రెట్టింపు చేసింది. యనమల వంటి వ్యూహకర్త కుటుంబంతో బంధుత్వం ఉండటం వల్ల పార్టీ అధిష్టానం వద్ద మహేష్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సమీకరణాల వల్లే యువకుడైనప్పటికీ, 2024 ఎన్నికల్లో ఏలూరు వంటి కీలకమైన పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఆయనకు దక్కింది.
బలమైన యాదవ సామాజికవర్గానికి...
అదే సమయంలో తెలంగాణలోని బలమైన యాదవ సామాజిక వర్గ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబంతో ఉన్న వియ్యం కూడా మహేష్‌కు అదనపు బలాన్ని చేకూర్చింది. మహేశ్ కుమార్ సోదరిని తలసాని కుమారుడు సాయికిరణ్ వివాహం చేసుకున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లోని ముగ్గురు సీనియర్ నేతల నీడలో మహేశ్ రాజకీయం సాగుతోంది. కొద్దిరోజులకు ఆయన కేసు నుంచి బయటపడతారేమో కానీ రాజకీయంగా మరోసారి అవకాశాలు రావడం మాత్రం కష్టమని అనుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో పుట్టా మహేశ్ ను పక్కన పెట్టవచ్చని, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబుకు అవకాశం దక్కనుందన్న ప్రచారం కూడా ఏలూరు నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. అయితే పుట్టా మహేశ్ వ్యవహారంలో న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం ఈ కేసు నుంచి బయటపడితే మాత్రం తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతారని ఆయన వర్గీయులంటున్నారు.
Tags:    

Similar News