Weather Report : వానలు.. ఈ ప్రాంతంలో దంచి కొడతాయట.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్నరెండు రోజులపాటు వర్షాలు పగతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2026-03-17 04:16 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్నరెండు రోజులపాటు వర్షాలు పగతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ మండుతున్న ఎండలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అట్టుడికపోతున్నాయి. దాదాపు నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు వేడి గాలుల తీవ్రత కూడా పెరిగింది. సెగ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పగటి పూట ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణలో వానలు పడతాయని చెప్పడంతో కొంత ఉపశమనం లభించినట్లయింది.

విస్తృతంగా వానలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో సోమవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, అల్లూరి, ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ అక్కడక్కడ ఉరుము, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ వానలు పడతాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలో ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిన్న భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
తెలంగాణలోనూ చిరుజల్లులు...
తెలంగాణలోనూ మోస్తరు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని చెప్పింది. అయితే కొన్నిజిల్లాల్లో మాత్రమే వానలు పడతాయని, మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. మిగిలిన చోట్ల పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News