Tirumala : తిరుమలకు వెళ్లే వారికి అలెర్ట్.. క్యూ లైన్ లో వేచి ఉండాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

Update: 2026-03-17 02:56 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. వాతావరణం చల్లగా ఉండటంతో పాటు వేసవి రద్దీ పెరుగుతుందన్న కారణంగా ముందుగానే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

జూన్ నెల దర్శన కోటా విడుదల ఎప్పుడంటే...
2026 జూన్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన మే నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు మార్చి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.
వర్చువల్ సేవల కోటా విడుదల...
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.
శిలాతోరణం వరకూ...
తిరుమలలోని వైకుఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,606 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,415 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News