భారత ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. హార్ముజ్ ద్వారా నౌకలు సురక్షితంగా భారత్ కు చేరుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరతకు చెక్ పడనుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో ఎదురైన అంతర్జాతీయ అడ్డంకులను అధిగమించి, సుమారు 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ లోడ్‌తో వస్తున్న 'శివాలిక్' నౌక ఈ రోజు తెల్లవారుజామున గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. దీనికి తోడు, అదే స్థాయిలో నలభై ఆరు వేల మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో వస్తున్న మరో భారీ నౌక 'నందా దేవి'కి ఇండియన్ నేవీ పటిష్టమైన ఎస్కార్ట్‌ను కల్పిస్తోంది. యుద్ధ నౌకల రక్షణలో వస్తున్న ఈ నౌక కూడా అతి త్వరలోనే భారత తీరానికి చేరుకోనుంది. ఈ రెండు ప్రధాన నౌకల రాకతో దేశీయంగా గ్యాస్ సరఫరాలో ఉన్న ఇబ్బందులు చాలా వరకు తీరనున్నాయని భారత ప్రభుత్వం తెలిపింది.
రెండు రోజుల నుంచి...
గత రెండు రోజులుగా కూడా భారత్‌కు గ్యాస్ సరఫరా నిరంతరాయంగా అందుతోంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన మూడు నౌకలు ముంబై, విశాఖపట్నం పోర్టులలో లంగరు వేశాయి. వీటి ద్వారా సుమారు 80 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ దేశంలోని వివిధ పంపిణీ కేంద్రాలకు చేరవేస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల దృష్ట్యా సరఫరాకు ఆటంకం కలగకుండా ఇండియన్ నేవీ, యు కోస్ట్ గార్డ్ అధికారులు నిరంతరం పహారా కాస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియా నుంచి వచ్చే నౌకలకు సముద్రపు దొంగల నుంచి లేదా ఇతర దాడుల నుంచి ముప్పు ఉండటంతో, రక్షణ శాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చాలా జాగ్రత్తతో ఈ నౌకలను అనుకున్న ప్రదేశాలకు చేరుస్తుంది.
మొత్తం 92 వేల మెట్రిక్ టన్నులు...
ప్రస్తుతం వస్తున్న శివాలిక్, నందా దేవి నౌకల ద్వారా మొత్తం 92 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రానుంది. ఇది దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న లక్షలాది గ్యాస్ బుకింగ్‌లను క్లియర్ చేయడానికి సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న పండుగ సీజన్ తో పాటు శుభకార్యాల దృష్ట్యా డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో, ముందు జాగ్రత్తగా మరిన్ని నౌకలను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. నౌకలు పోర్టుకు చేరుకోగానే గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్‌లకు యుద్ధ ప్రాతిపదికన తరలించి, వినియోగదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద గ్యాస్ కొరత లేకుండా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న భారత ప్రభుత్వం సమస్యను అధిగమించే దిశగా ప్రయత్నిస్తుంది.