BRS : ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ పాఠాలు నేర్చుకోదా?
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అలసత్వంతో తనకు తాను చిక్కులు కొని తెచ్చుకుంటోంది.
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అలసత్వంతో తనకు తాను చిక్కులు కొని తెచ్చుకుంటోంది. పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికినా మీన మేషాలు లెక్కపెడుతూ ఈరోజు షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఆ పార్టీ ప్రజల్లో పలుచనగా మారిందనే చెప్పాలి. మొయినా బాద్ ఫామ్ హౌస్ అనేది పైలట్ రోహిత్ రెడ్డిది. అక్కడ పోలీసులపై కాల్పులు జరపడమే కాకుండా డ్రగ్స్ వాడారని నిర్ధారణ అయింది. ఈ డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న పుట్టా మహేశ్ కు తెలుగుదేశం పార్టీ వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ బీఆర్ఎస్ నేడు నింపాదిగా నోటీసులు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఆత్మరక్షణలో పడేసినా...
అసలే అంతంత మాత్రంగా ఉన్న బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వెంటనే చర్యలు తీసుకుని ఉంటే ఈ అపవాదును ఎదుర్కొనే అవకాశం ప్రత్యర్థులకు ఇచ్చి ఉండదు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ ఉదంతం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడటం బీఆర్‌ఎస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇది రాజకీయ కుట్ర అని అభివర్ణించడం సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది.
ఆరోపణలు వచ్చిన వెంటనే...
సాధారణంగా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీలు తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి నిందితులను దూరం పెడతాయి. కానీ, రోహిత్ రెడ్డి విషయంలో బీఆర్‌ఎస్ చూపుతున్న సాఫ్ట్ కార్నర్ వెనుక ఉన్న అసలు కారణాలేమిటన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలే కవితతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి విషయాల్లో ఏమాత్రం వేచి చూసి ఉండకూడదు. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంంది. రోహిత్ రెడ్డికి, బీఆర్‌ఎస్ అగ్రనేతలకు మధ్య ఉన్న అంతర్గత సంబంధాల వల్లే పార్టీ ఆయనను వెనకేసుకొస్తోందని కాంగ్రెస్ బలంగా ప్రచారం చేస్తోంది. చివరకు ఏడురోజుల సమయం ఇచ్చి షోకాజ్ నోటీసు ఇచ్చినప్పటికీ అది కంటితుడుపు చర్యేనంటూ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తుండటం బీఆర్ఎస్ ను మరింత ట్రబుల్ లోకి నెట్టినట్లయింది.