Israel - Iran War : మధ్యప్రాచ్యంలో యుద్ధం.. పెరిగిన దాడులు
ఇజ్రాయిల్ - ఇరాన్ యుద్ధం మధ్య యుద్ధం రెండో వారానికి చేరుకున్నా ఇంకా ఉద్రిక్తతలు తగ్గలేదు
ఇజ్రాయిల్ - ఇరాన్ యుద్ధం మధ్య యుద్ధం రెండో వారానికి చేరుకున్నా ఇంకా ఉద్రిక్తతలు తగ్గలేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ నుంచి వచ్చిన దాడుల నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మళ్లీ తెరిచింది. పరిస్థితి స్థిరపడటంతో విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని ప్రభుత్వ వార్తాసంస్థ డబ్ల్యూఏఎం వెల్లడించింది. దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. ఇరాన్ దాడులు కొనసాగుతున్న వేళ, తమ ప్రధాన ఎయిర్‌లైన్స్ ‘ఎమిరేట్స్’, ‘ఎతిహాద్’ సేవలను కొనసాగించాల్సిన అవసరం అధికారులకు సవాల్‌గా మారింది. సోమవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇరాన్ డ్రోన్ దాడి జరగడంతో ఇంధన ట్యాంక్‌లో మంటలు చెలరేగాయి. కొంతసేపు విమాన సేవలు నిలిచిపోయాయి.
బహుముఖంగా యుద్ధం...
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో సైనిక లక్ష్యాలపై దాడులు కొనసాగించాయి. మరోవైపు లెబనాన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబుదాడులు పెంచింది. దీనికి ప్రతిగా ఇరాన్ డ్రోన్ దాడులు చేపట్టింది. హోర్ముజ్ జలసంధిలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంలో నౌకల రాకపోకలు తీవ్రంగా తగ్గాయి. దాడుల భయం చమురు ధరలను పెంచుతోంది.
చమురు సంక్షోభ భయం..
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలను హోర్ముజ్ జలసంధి భద్రత కోసం యుద్ధనౌకలు పంపాలని కోరారు. అయితే వెంటనే స్పందన రాలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ, “మా దృష్టిలో జలసంధి తెరిచి ఉంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్, వారి మిత్రులకు మాత్రం కాదు” అన్నారు. యుద్ధం ముగింపు కోసం చర్చలు జరుగుతున్నాయన్న వార్తలను కూడా ఆయన ఖండించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ దాడులు...
ఇరాన్‌పై దాడులు ప్రారంభమైనప్పటి నుంచి రెండు వారాలుగా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలు, గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలపై డ్రోన్, క్షిపణి దాడులు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున కూడా ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గలిలీ సముద్రం దక్షిణ ప్రాంతంలో అలారాలు మోగినప్పటికీ ఎలాంటి గాయాలు నమోదుకాలేదు.