ముగించేసినట్లా... వాయిదా వేసినట్లా?

జగన్ నేరుగా కార్యకర్తలతో సమావేశం అవ్వాలనుకున్నారు. తాడేపల్లి లో హడావిడి మొదలయింది.

Update: 2022-09-02 07:41 GMT

ఏదైనా ఆదిలోనే అట్టహాసం.. ఆ తర్వాత మళ్లీ మామూలే. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మరోె రెండేళ్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలూ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యాయని చెప్పాలి. చంద్రబాబు టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ కూడా వచ్చే నెల నుంచి బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. ఇక అధికార వైసీపీ కూడా వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇన్నాళ్లూ పాలనపై దృష్టి పెట్టిన జగన్ పార్టీపై పెట్టారు. గడప గడపకు ప్రభుత్వం అంటూ జనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది.

గడప గడపకు ప్రభుత్వంలో....
గడప గడపకు ప్రభుత్వంలో కొంత ప్రజల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రశ్నలు ఎదురయినా సాఫీగానే సాగిందన్నది పార్టీ వర్గాలు చెబుతున్న దానిని బట్టి తెలుస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం జనం నుంచి వ్యతిరేకత తీవ్రంగా ఎదురుకావడంతోనే దానిని నిలిపేశారంటున్నారు. ప్రతి నెల గడప గడపకు ప్రభుత్వం పై జగన్ ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ నిర్వహించారు. రెండు సార్లు ఆ వర్క్ షాపు జరిగింది. తర్వాత దానిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కూడా నిలిచిపోయింది. కార్యక్రమాన్ని ముగించడంతో ఎమ్మెల్యేలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
ముఖ్య కార్యకర్తలతో...
ఇక జగన్ నేరుగా కార్యకర్తలతో సమావేశం అవ్వాలనుకున్నారు. తాడేపల్లి లో హడావిడి మొదలయింది. తొలుత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంతో ముఖాముఖి మొదలుపెట్టారు. అందులో భరత్ ను అభ్యర్థిగా ప్రకటించారు. భరత్ ను వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుని వస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆ తర్వాత రాజాం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాను కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీ మీద దృష్టి పెట్టానని, ఇక కార్యకర్తలు డీలా పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
రెండు మూడు నియోజకవర్గాలతో....
అంతే సీన్ కట్ చేస్తే.. ఆ కార్యక్రమం కూడా ఆ తర్వాత అంతటితో ఆగిపోయినట్లే కనపడుతుంది. ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరగడం లేదు. వాటిని నిలిపివేశారా? లేదా తాత్కాలికంగా వాయిదా వేశారా? అన్నది తెలియదు. కానీ మిగిలిన నియోజకవర్గ కార్యకర్తలు జగన్ తో సమావేశం కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తమ మనసులో మాటను చెప్పుకునేందుకు ఇదే సరైన వేదిక అని అభిప్రాయపడుతున్నారు. కానీ నియోజకవర్గాల సమీక్షలో ఆ జిల్లా మంత్రితో పాటు నియోజకవర్గం ఎమ్మెల్యేను కూడా కూర్చుండబెడుతుండటంతో వాస్తవ విషయాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యమైన కార్యకర్తలను పీకే టీం ఎంపిక చేసినా వేదికపై వారిని చూసి నోళ్లు తెరవలేదు. జగన్ నేరుగా కార్యకర్తలతో సమావేశం అయితే వారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారన్నది పార్టీ అధినాయకత్వం ఆలోచన. కానీ ఎందుకో మరి ఆ కార్యక్రమం కూడా రెండు, మూడు నియోజకర్గాలతోనే జరిపి మమ అనిపించేశారు. ముగించారా? వాయిదా వేశారా? అన్న ప్రశ్నకు వైసీపీ అధినాయకత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.


Tags:    

Similar News