జగన్ ఇక స్పేర్ చేయరా? మినహాయింపు లేదట

వైసీపీ అధినేత జగన్ తనను మభ్య పెడుతున్న వారిని గుర్తించి పక్కన పెట్టారంటున్నారు. ఇందులో ఎవరికీ జగన్ మినహాయింపు ఇవ్వలేదు.

Update: 2022-11-25 06:17 GMT

వచ్చే ఎన్నికల్లో గెలవడమే ధ్యేయంగా జగన్ ముందుకు వెళుతున్నారు. అందుకు అవసరమైతే తనకు నమ్మకమైన వారిని కూడా జగన్ పక్కన పెట్టడానికి వెనుకాడటం లేదు. అధికారం కావాలనుకున్న వారు ఎవరైనా అంతే చేస్తారంటారు. ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఏ అధినేత అయినా తనను మాటలతో మభ్యపెట్టే వారిని కొంతకాలం గుర్తించకపోవచ్చు. అయితే దీర్ఘకాలంలో అది పనిచేయదు. ఏదో ఒక రూపంలో తాను నమ్మిన వ్యక్తే పార్టీని పట్టించుకోకుండా తనకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని తెలియవచ్చు. ఇప్పుడు వైసీపీలో అదే జరిగిందంటున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో జగన్ పూర్తిగా మారిపోయారంటున్నారు.


మభ్య పెడుతున్న వారిని...

జగన్ తనను మభ్య పెడుతున్న వారిని గుర్తించి పక్కన పెట్టారంటున్నారు. ఇందులో ఎవరికీ జగన్ మినహాయింపు ఇవ్వలేదు. అలాగే ఎమ్మెల్యేలకు కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయించడంలో రాజీ పడే ప్రసక్తి ఉండదని అంటున్నారు. ప్రజల్లో సానుకూలత లేని ఎమ్మెల్యేలను జగన్ పక్కకు తప్పిస్తారని చెబుతున్నారు. మంత్రి కొడాలి నాని జగన్ కు అత్యంత సన్నిహితుడు. కమ్మ సామాజికవర్గమయినా జగన్ వెంటే నడిచారు. ఒక రకంగా చెప్పాలంటే కొడాలి నాని జగన్ తరుపున వాదన వినిపించే బలమైన వాయిస్ గా కనిపిస్తారు. వినిపిస్తారు. అలాంటి కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తప్పించారు. ఓకే. అది ముఖ్యమంత్రిగా జగన్ కు ఉన్న విచక్షణాధికారం. కానీ ఒక పార్టీ అధినేతగా నానిపై ఫెయిల్యూర్ అని ముద్ర వేసి ఆయనకు ఇచ్చిన పార్టీ పదవి నుంచి తప్పించడంపై ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతుంది.
సజ్జల వంటి వారికి...
ఇక ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే జగన్ నాలుక అన్నది విపక్షాల నుంచి వినిపిస్తున్న మాట. సకల శాఖల మంత్రిగా కూడా ఆయనను విపక్ష నేతలు విమర్శిస్తుంటారు. జగన్ నేరుగా చెప్పకుండా ఏ విషయాన్నైనా సజ్జల చేత చెప్పిస్తారని పార్టీలో కూడా అనుకుంటారు. జగన్ ను కలవడానికి ముందు వైసీపీ నేతలకు సజ్జలను కలవడం ఒక సంప్రదాయంగా వస్తుంది. ఒకరకంగా పార్టీలో నెంబర్ 2 అని మొన్నటి వరకూ విజయసాయిరెడ్డి అనుకున్నా, తర్వాత తర్వాత సజ్జల ఆ నెంబర్ ను చేజిక్కించుకున్నారని అనేవారు లేకపోలేదు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి తప్పించడం పార్టీలో చర్చనీయాంశమైంది. సజ్జలను కూడా జగన్ పక్కన ఎందుకు పెట్టారన్నది పార్టీ నేతలను పట్టి పీడిస్తున్న సందేహం.

సంకేతాలు అవేనా?
మరో వైపు ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పాలకుండా గత మూడున్నరేళ్ల నుంచి ఢిల్లీ నుంచి చక్కర్లు కొడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని కూడా జగన్ స్పేర్ చేయలేదు. ఆయనను కూడా కర్నూలు, నంద్యాల జిల్లాల సమన్వయ బాధ్యతల నుంచి తప్పించారు. పని వత్తిడి అని తప్పించారంటే అదీ కాదనుకోవాలి. సొంత జిల్లాలోనే బుగ్గన సమన్వయం చేసుకోలేకపోతున్నారని నివేదికలు అందడంతో ఆయనను పక్కన పెట్టారని చెబుతున్నారు. ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాస్ లను కూడా జగన్ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఒకరకంగా తాను ఎన్నికల్లో గెలవడానికే ప్రాధాన్యత ఇస్తానని, వ్యక్తులకు ప్రయారిటీ ఇవ్వనని జగన్ పార్టీ నేతలకు సంకేతాన్ని పంపినట్లయింది. వీరిలో కొందరు తమంతట తాము అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కోరగా, మరికొందరిని మాత్రం పనితీరు ఆధారంగానే తప్పించారని చెబుతున్నారు. మొత్తం మీద రానున్న కాలంలో జగన్ పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News