డబుల్ ఆర్ తో భేటీ... సిగ్నల్స్ రీచ్ అవుతాయా?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అకస్మాత్తుగా జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది.

Update: 2022-08-21 12:23 GMT

బీజేపీ తెలంగాణలో ప్రత్యేక స్ట్రాటజీతో ముందుకు వెళుతుంది తెలంగాణలో కమ్మ సామాజికవర్గం ఓట్లపై గురి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి కమ్మ సామాజికవర్గం అండగా నిలిచేందుకు పావులు కదుపుతుంది. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా డబుల్ ఆర్ తో భేటీ అవుతున్నారు. ఒకటి అమిత్ షా ప్రత్యేకంగా ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావును కలుస్తున్నారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయి తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సహకారాన్ని కోరనున్నారు. ఓకే అంత వరకూ ఎవరూ పెద్దగా ఆశ్చర్యపడలేదు. కొద్ది రోజులుగా ఆయన కలుస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

చివరి నిమిషంలో....
కానీ తన షెడ్యూల్ లో అమిత్ షా అకస్మాత్తుగా జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. డిన్నర్ కు జూనియర్ ఎన్టీఆర్ ను స్వయంగా అమిత్ షా ఆహ్వానించారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయనకు తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే అమితమైన గౌరవం భక్తి. అది ఎన్టీఆర్ మాటల్లో ప్రతి సారీ మనం వింటుంటాం. అలాంటిది ఆయన నేరుగా బీజేపీకి ఎన్నికల్లో మద్దతిస్తాడని ఊహించడం కూడా కష్టమే. మరోవైపు రాజకీయాలకు ఏమాత్రం సంబంధంలేని జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడమే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ నెంబర్ టూ గా ఉన్న అమిత్ షా జూనియర్ ను కలవడంలో అంతరార్థమేమిటన్నది అంతుబట్టని ప్రశ్నగా ఉంది.
ఆ సామాజికవర్గం....
నిజానికి కూకట్ పల్లిలో తెలుగుదేశం పార్టీ హరికృష్ణ కూతురు సుహాసినిని పోటీ చేయించనప్పుడు కూడా ఆమె గెలవలేదు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఆ సామాజికవర్గం అండగా లేదన్నది నాడే స్పష్టమయింది. కమ్మ సామాజికవర్గం ఓటర్లు గత రెండు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కొంత ఆ సామాజికవర్గంలో మార్పు వచ్చింది. పారిశ్రామికవేత్తలుగానూ, కొన్ని నియోజకవర్గాల్లో కీలకంగానూ ఉన్న వారు ఈసారి ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ వైపు వారు వెళ్లకుండా ఉండేందుకే అమిత్ షా రామోజీరావును, జూనియర్ ఎన్టీరామారావును కలుస్తున్నారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.
బాబుకు దూరంగా ఉన్న...
ఇక చంద్రబాబు కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్ కు పెద్దగా సంబంధాలు లేవు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. చంద్రబాబు అంటే ఆగ్రహంగా ఉన్న జూనియర్ ను అమిత్ షా కలవడం కూడా ఆలోచించాల్సిన విషయమేనన్నది వాస్తవం. అయితే రాజకీయాల్లోకి ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ రారన్నది కూడా నిజం. కానీ అతనిని కలిసి కమ్మ సామాజికవర్గంలోనూ, జూనియర్ ఫ్యాన్స్ లోనూ బీజేపీకి తీసుకెళ్లాలన్న ప్రయత్నమే అమిత్ షా కలవడం అని కూడా వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ చేస్తూ RRR సినిమా గురించి మాట్లాడతారా? లేదా? రాజకీయం గురించి ప్రస్తావిస్తారా? అన్నది పక్కన పెడితే డబుల్ ఆర్ తో అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయాలకు తెరలేపారన్నది మాత్రం వాస్తవం.


Tags:    

Similar News