టెన్త్ రిజల్ట్... ఫక్తు పాలిటిక్స్

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు కతీతం ఏదీ కాదు. చివరకు పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా రాజకీయరంగు పులుముకున్నాయి

Update: 2022-06-07 05:56 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు కతీతం ఏదీ కాదు. చివరకు పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా రాజకీయరంగు పులుముకున్నాయి. విద్యార్థులు పరీక్షలు సక్రమంగా రాస్తేనే పాస్ అవుతారు. ఎక్కువ మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు. వాల్యుయేషన్ కూడా నిపుణులైన ఉపాధ్యాయులే చేస్తారు. మార్కుల ఆధారంగా ఉత్తీర్ణత ఉంటుంది. అయితే పదో తరగతి ఫలితాలు కూడా తమకు రాజకీయంగా మలచుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

బాబు హయాంలో....
చంద్రబాబు హయాంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు 98 శాతం వరకూ ఉండేవని, ఇప్పడు 62.76 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని, ఇది జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విద్యాశాఖకు సరైన నిధులు ఇవ్వకపోవడం, విద్యాప్రమాణాలు పడిపోవడం కారణంగానే ఫలితాలు పడిపోయాయంటున్నారు. ఉపాధ్యాయులను ఇతర విధులకు వినియోగించడం కారణంగా కూడా ఫలితాలు తగ్గడానికి కారణమని చెబుతున్నారు.
పథకాలకు నిధులు లేక...
మరోవైపు ప్రభుత్వం కావాలనే ఉత్తీర్ణత శాతం తగ్గించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎక్కువ రిజల్ట్ వస్తే ఇంటర్, పాలిటిక్నిక్ లో చేరే విద్యార్థులకు అమ్మఒడి, ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాలు అమలు చేయలేక, నిధుల లేమితో ఎక్కువ మందిని ప్రభుత్వం కావాలని ఫెయిల్ చేసిందని ఆరోపిస్తున్నాయి. 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదంటే ఇందుకు నిదర్శనం అదేనని చెబుతున్నారు. కరోనా లేకపోవడంతో పూర్తిస్థాయి క్లాసులు జరిగాయని, ఫలితాలు ఎందుకు తగ్గాయో వివరణ ఇవ్వాలని ప్రధానంగా టీడీపీ డిమాండ్ చేస్తుంది. కరెంట్ కోతలు, పరీక్ష సమయం కుదింపు కూడా ఒక కారణమంటుంది.
నిజంగా అలా జరుగుతుందా?
నిజానికి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ పై ఆటలాడుకుంటుందా? పథకాలు అమలు చేయడానికి నిధులు అడ్డంకి అని ఉత్తీర్ణతను తగ్గిస్తారా? రీ వ్యాల్యుయేషన్, రీ కౌంటింగ్ సదుపాయం ఉన్న తరుణంలో ఇది ఎలా సాధ్యమవుతుంది. బోధన చేసే ఉపాధ్యాయులను ఏమీ అనకుండా ఉత్తీర్ణత తగ్గడం పై ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. విద్యకు తమ ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇస్తుందని, ఒక్కసారి టీడీపీ నేతలు వారి సొంత నియోజకవర్గాల్లో పాఠశాలలను చూసుకోవచ్చని సూచిస్తున్నారు. అన్ని సౌకర్యాలు, అవకాశాలు కల్పించినా ఉత్తీర్ణత శాతం తగ్గడం ప్రభుత్వానికి ఆపాదించడం సరైంది కాదని వైసీపీ నేతలు అంటున్నారు. దాదాపు రెండు లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతిలో ఫెయిల్ అయ్యారు. వారి కుటుంబాలను తమ వైపునకు తిప్పుకునేందుకే విపక్షం ఈ రకమైన ప్రచారం చేస్తుందని అధికార పార్టీ అంటోంది. మొత్తం మీద ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు కూడా విపక్షాలకు రాజకీయ అస్త్రాలుగా మారాయి.



Tags:    

Similar News