కన్నా పై అంత ప్రేమ ఎందుకో?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఇట్టే అర్ధమయింది.

Update: 2021-12-18 02:26 GMT

తిరుపతిలో అమరావతి రైతుల మహా సభ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఇట్టే అర్ధమయింది. బీజేపీ తరుపున సభలో పాల్గొనేందుకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను తన పక్కకు రమ్మని చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పక్కన సీపీఐ అగ్రనేత నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఉన్నా చంద్రబాబు చూపంతా కన్నా లక్ష్మీనారాయణపైనే ఉంది.

పొత్తు కోసం....
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. ఏపీలో దానికి పెద్దగా బలం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఇక్కడ తనకు ఎన్నికల వ్యూహాలకు పనికి వస్తుందన్నది చంద్రబాబు ఆలోచన. దానికి తోడు పవన్ కల్యాణ‌్ కూడా తోకలా దాని వెంట వస్తారు. బీజేపీకి తక్కువ సీట్లు పొత్తులో భాగంగా ఇచ్చి రాజకీయంగా ఎక్కువ లబ్ది పొందవచ్చు. అందుకే అమరావతి రైతుల సభలోనూ చంద్రబాబు తీరు అదే స్పష్టం చేసింది.
రెండు కారణాలు...
తన ప్రసంగంలో మోదీని, బీజేపీపై ప్రశంసలు కురిపించారు. ఇక కన్నా లక్ష్మీనారాయణను అక్కున చేర్చుకోవడానికి రెండు కారణాలు కన్పిస్తున్నాయి. ఒకటి కాపు సామాజికవర్గంలో బలమైన నేత. తనను వ్యతిరేకించే సోము వీర్రాజు కంటే సామాజికవర్గలో ఫేమ్ ఉన్న నేత. అలాగే బీజేపీలో ఉన్నత పదవిలో ఉన్నారు. ఈ రెండు కారణాలు కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబును అక్కున చేర్చుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
లెఫ్ట్ పార్టీలు ఇక అంతేనా?
కమ్యునిస్టు పార్టీలు చంద్రబాబు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని సీపీఐ తొలి నుంచి ఆయనతో ప్రయాణం చేస్తుంది. టీడీపీకి అన్ని విషయాల్లో మద్దతు పలుకుతూ వస్తుంది. సీపీఎం కొంత దూరం పాటిస్తుంది. సభలోనే సీపీఐ అగ్రనేత నారాయణను పక్కన పెట్టి, కన్నా లక్ష్మీనారాయణను కౌగిలించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయింది. బీజేపీ చంద్రబాబుతో కలుస్తుందో లేదో తెలియదు కాని ఆయన ప్రతి అవకాశాన్ని కమలం పార్టీతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చివరకు కధ ఎలా ముగుస్తుందో చూడాల్సి ఉంది.


Tags:    

Similar News