ఇక్కడ గెలిస్తే చాలట...బాబు హోప్స్ చాలా

టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టి పెట్టింది. చంద్రబాబు మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తున్నారు

Update: 2023-03-08 04:51 GMT

శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి సంఖ్య తక్కువగా మారిపోతుంది. ఏ కోటాలో ఎన్నికలు జరిగినా అది వైసీపీ ఖాతాలోనే పడుతున్నాయి. ఎమ్మెల్యే కోటా కావచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల కోటా కావచ్చు. వైసీపీకే ఆధిక్యత ఉండటంతో ఆ పార్టీకే విజయావకాశలున్నాయి. ఎమ్మెల్యే కోటా అంటే 23 స్థానాలున్న టీడీపీకి ఎమ్మెల్సీని గెలిపించుకునే అవకాశమే లేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ అంతే. తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, పంచాయతీల్లో అధిక భాగం వైసీపీకే దక్కాయి. దీంతో ఆ కోటా ఎమ్మెల్సీ స్థానాలు కూడా వైసీపీ ఖాతాల్లోనే పడతాయి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు...
అందుకే తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టి పెట్టింది. చంద్రబాబు మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో పట్టు సాధించి ఎలాగైనా తమ పార్టీ నేతలను మండలికి తీసుకురావాలని భావిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే చాలా రకాలుగా పార్టీకి ఉపయోగపడుతుంది. ఒకటి ప్రభుత్వంపై వ్యతిరేకత అంచనాను వేయడానికి ఈ ఎన్నికలు ఉపయోపడతాయి. మరొకటి పొత్తులతో వచ్చే పార్టీల అధిక సీట్లు కోరకుండా తమ బలమేంటో చెప్పుకునేందుకు వీలుంటుంది. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఏపీీటీఫ్‌కు మద్దతు ప్రకటించింది.
మూడు ప్రాంతాల...
పశ్చిమ రాయలసీమ పరిధిలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ తరుపున భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. తూర్పు రాయలసీమకు సంబంధించి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వేపాడ చిరంజీవిరావును బరిలోకి దించారు. అయితే మూడు ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ఖచ్చితంగా గెలిచి తీరాలని చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ముగ్గురు అభ్యర్థులను గెలిపించుకునేలా వ్యూహలను రూపొందించుకోవాలని కోరారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత...
ప్రస్తుత ప్రభుత్వంపై యువతలో వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తుంది. నిరుద్యోగ సమస్య పెరిగి పోవడం, పరిశ్రమలు రాకపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గడం వంటి కారణాలతో గ్రాడ్యుయేట్లు తమకు అండగా నిలుస్తారని భావిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమకు అండగా నిలుస్థారన్న భరోసాలో చంద్రబాబు ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే యువతతో పాటు ఉద్యోగులు కూడా తమవైపే ఉన్నారన్నది స్పష్టమయ్యే అవకాశముంది. ఈ అవకాశం ద్వారా తమకు రాజకీయంగా రానున్న కాలంలో అనేక ప్రయోజనాలు వాటంతట అవే దక్కుతాయని భావిస్తున్నారు. అందుకోసం తరచూ టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ నేతలను చంద్రబాబు అప్రమత్తం చేస్తున్నారు.


Tags:    

Similar News