టీడీపీ అంచనా తప్పిందా? ఆత్మకూరు ఫలితం ఏం చెప్పింది?

మూడేళ్లలో తీవ్ర అసంతృప్తి వైసీపీపై పెరిగిందని టీడీపీ అంచనా వేస్తుంది. కానీ ఆత్మకూరు ఉపఎన్నికల్లో మెజారిటీ అలా రాలేదు

Update: 2022-06-26 13:18 GMT

ఉప ఎన్నిక అంటే సహజంగా అధికార పార్టీకే అడ్వాంటేజీ ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఓటర్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం వారికే ఓట్లు వేస్తారు. అయితే మూడేళ్లలో తీవ్ర అసంతృప్తి వైసీపీ ప్రభుత్వంపై పెరిగిందని టీడీపీ అంచనా వేస్తుంది. తమ పార్టీ అధినేతల సభలకు జనం పోటెత్తడమే ఇందుకు ఉదాహరణ అని చెబుతోంది. అయితే ఇంత పెద్దస్థాయిలో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మెజారిటీ రావడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడా కన్పించలేదు.

అధికార పార్టీ....
అధికార పార్టీ కాబట్టి .. మంత్రులు మొహరించారు కాబట్టి... డబ్బు సంచులు కుమ్మరించారు కాబట్టి.. ఆ మెజారిటీ వచ్చిందని విపక్షాలు విమర్శించవచ్చు. కానీ నిజంగా జగన్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉంటే ప్రజలు తమకు వచ్చిన అవకాశాన్న ఉపయోగించుకుంటారు. ప్రభుత్వంపై అసంతృప్తిని ఓటు ద్వారానే తెలియజేయడానికి ఇష్టపడతారు. డబ్బులు, అధికారం పోలింగ్ రోజున పనిచేయవన్నది అనేకసార్లు స్పష్టమయింది. ప్రజల్లో నిజంగా ఈ ప్రభుత్వం పనికిరాదని భావిస్తే తమ అసంతృప్తిని ఓటు ద్వారా తెలియజేయడానికి ఏమాత్రం సందేహించరు.
తెలంగాణలో...?
తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలు కావడానికి ప్రభుత్వంపై అసంతృప్తి కారణమన్న విశ్లేషణలు నాడే వెలువడ్డాయి. దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందాడన్న సెంటిమెంట్ ను కూడా ప్రజలు పట్టించుకోలేదు. ఆ కుటుంబానికే టిక్కెట్ ఇచ్చినా అక్కడి ప్రజలు ఓడించారు. అయితే ఆత్మకూరులో మాత్రం అటువంటిది కన్పించలేదు. ఇక్కడ టీడీపీ పోటీ చేయలేదన్నది వాస్తవమే. టీడీపీ అనుకూల ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా పడాలి కదా? బీజేపీకో? బీఎస్పీకో వారు వేసి తమ కసి తీర్చుకోవాలి కదా? కానీ ఆత్మకూరులో జనం వన్ సైడ్ జగన్ పార్టీకి ఓట్లు వేశారు.
అంత వ్యతిరేకత లేదని...
అంటే విపక్ష నేత చెబుతున్నట్లుగా బాదుడే బాదుడే అన్న ఆలోచన ప్రజల్లో ఉంటే... ఈ తరహా ఓట్లు వైసీపీకి రానే రావు. అవతల ఉన్నది బీజేపీయా? బీఎస్పీయా? అన్నది ప్రజలు చూడరు. నిజంగా అసంతృప్తి ఉన్నప్పుడు తమకు వచ్చిన అవకాశాన్ని ప్రజలు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తిరుపతి పార్లమెంటు, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో ప్రజలు పట్టం కట్టారు. దీంతో వైసీపీ నేతలు తమ ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదన్న ఆలోచనలో ఉన్నారు. ఒక వర్గం మీడియా, ప్రతిపక్ష నేత చేస్తున్న ప్రచారంగా దానిన కొట్టిపారేస్తున్నారు.


Tags:    

Similar News