బాబుకు కొత్త వ్యూహకర్త... రాబిన్ శర్మ అవుట్

రాబిన్ శర్మ టీం పై నమ్మకం కుదరని చంద్రబాబు మరో డీల్ కుదుర్చుకున్నారని తెలిసింది.

Update: 2022-02-13 08:38 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొన్ని నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమించలేదు. కారణం ఇక్కడ యువకులను నియమించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఆర్థిక, సామాజికపరంగా బేరీజు వేసుకుని చంద్రబాబు ఇన్ ఛార్జిలను నియమిస్తారంటున్నారు. ఇప్పటికీ దాదాపు ముఫ్ఫయి నుంచి నలభై నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్ ఛార్జులు లేరు. నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు చేస్తూ ఇన్ ఛార్జిలపై నిర్ణయం తీసుకుంటున్నారు.

ఇన్ ఛార్జిలను మార్చి....
ముఖ్యమైన నియోజకవర్గాల్లో యువకులకు ఇన్ ఛార్జి పదవులను ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నారు. యువకులయితేనే ఈ రెండేళ్ల పాటు పార్టీని నియోజకవర్గాల్లో ధైర్యంగా నడపగలరని నమ్ముతున్నారు. సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే చంద్రబాబు సీనియర్ నేతలకు సంకేతాలను ఇచ్చారు. అనేక నియోజకవర్గాల్లో చంద్రబాబు సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు.
ప్రత్యేకంగా సర్వే....
గత ముప్ఫయి నెలలుగా పార్టీని పట్టించుకోనిది ఎవరు? నియోజకవర్గంలోని క్యాడర్ కు దూరంగా ఉన్నదెవరు? అక్కడ మరో బలమైన నేత ఎవరు? అన్న అంశాలతో ప్రత్యేకంగా చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. రాబిన్ శర్మ నేతృత్వంలో రాష్ట్రంలో అనేక బృందాలుగా విడిపోయి ఈ సర్వే నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. సర్వే లో ఎవరి పేర్లు ఖరారయితే వారికే చంద్రబాబు ఇన్ ఛార్జి పదవులు ఇస్తారని మొన్నటి వరకూ చెప్పారు. అయితే రాబిన్ శర్మ టీం పై నమ్మకం కుదరని చంద్రబాబు మరో డీల్ కుదుర్చుకున్నారని తెలిసింది. ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్న సునీల్ తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారంటున్నారు.
కొత్త వారికి ఛాన్స్....
ప్రస్తుతం ఇన్ ఛార్జిలుగా ఉన్న వారిని కూడా కొన్ని చోట్ల మార్చాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. వారు ఉన్నా పార్టీకి ఉపయోగం లేదని భావించిన చంద్రబాబు వారి స్థానంలో కొత్తనేతలకు స్థానం కల్పించాలని యోచిస్తున్నారు. అదే జరిగితే కొందరు నేతలు ఇన్ ఛార్జి పదవులను కోల్పోయే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి చంద్రబాబు కఠినంగా ఉండాలనే భావిస్తున్నారు. రానున్న రెండేళ్లు కీలకం కావడంతో రాజీ పడే ప్రసక్తి ఉండకుండా యువకులకు ఎక్కువగా అవకాశమివ్వాలన్నది చంద్రబాబు యోచనగా ఉంది. మరి కొత్త వ్యూహకర్త ఎవరి జాతకం ఎలా రాస్తారో అన్నది పార్టీ నేతల్లో టెన్షన్ గా మారింది.


Tags:    

Similar News