ఒంటరితనంతోనే ఇలాంటి నిర్ణయాలా?

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేయకపోగా సమీక్షలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు

Update: 2021-12-07 06:10 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏంచేయాలో పాలుపోవడం లేదులా ఉంది. ఆయన పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేయకపోగా సమీక్షలతో కాలం వెళ్లబుచ్చుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది రెండు మున్సిపాలిటీలు. దానికి సమీక్షల పేరుతో ఇంత హంగామా, సమయం వృధా చేయడం అవసరమా? అన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. పైగా తమకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందంటూ కొంత జబ్బలు చరచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సమీక్షల పేరుతో....
అంతవరకూ బాగానే ఉన్నా పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని జగన్ ను రోజూ తిడుతుంటే పార్టీ బలోపేతం అవుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం చంద్రబాబు వద్ద లేదు. ఏదో ఒక అంశం మీద నిత్యం మీడియా సమావేశాలు పెడుతూ ప్రభుత్వంపై విరుచుకు పడటం తప్ప జనంలోకి వెళ్లేదెప్పుడు అన్నది పార్టీ సీనియర్ నేతలకు కూడా కలుగుతున్న సందేహం. అయితే చంద్రబాబుకు సలహాలిచ్చేవారు ఇప్పుడు ఎవరూ లేకపోవడమే ఈ దుస్థితికి కారణమంటున్నారు.
రెండు చోట్ల గెలిచిన....
అసలు రెండు చోట్ల గెలిచిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష ఏంటని కొందరు నేతలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలోనే ఓటమి పాలయితే దీనిపై సమీక్ష నిర్వహించి ఎవరిని తప్పుపడతారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో చంద్రబాబుకు సలహాదారులు కొందరు ఉండేవారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత వారు చాలా వరకూ దూరమయ్యారు.
నమ్మకం లేకనే....
చంద్రబాబు కూడా ఎవరు సలహాలను వినే స్థితిలో లేరు. ఆయన పార్టీలో ఎవరినీ నమ్మడం లేదంటున్నారు. తిరుపతిలో అచ్చెన్నాయుడు ఆడియో లీక్ తర్వాత చంద్రబాబు మరింత బిగుసుకుపోయారట. సీనియర్ నేతలతో కూడా అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో మాదిరి మనసు విప్పి మాట్లాడటం లేదు. ఆయన వద్దకు వెళ్లేందుకు కూడా నేతలు ఎవరూ పెద్దగా ఇష్టపడటం లేదు. మొత్తం మీద చంద్రబాబు ఒంటరితనంతో తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి బలం చేకూర్చకపోగా, మరింత బలహీనపరుస్తున్నాయంటున్నారు.




Tags:    

Similar News