ఇండిపెండెన్స్ డే.. ఈ నిజాలు మీకు తెలుసా..?

తెలుగు పోస్ట్‌ తన పాఠకులకి, వీక్షకులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది

Update: 2023-08-15 05:31 GMT

స్వాతంత్య్ర దినోత్సవం గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా తెలుగు పోస్ట్‌ తన పాఠకులకి, వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఈ సందర్భంగా మన స్వాతంత్య్ర దినోత్సవం, జాతీయ జెండా గురించి కొన్ని ఆసక్తికర సంఘటనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాం.

దేశం స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సందర్భంగా మనకూ ఓ జెండా కావాలని అనుకున్నారు. దీనికి అనుగుణంగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన మొదటి జాతీయ జెండాను కొల్‌కత (నాటి కలకత్తా)లో 1906, ఆగస్టు 6 ఆవిష్కరించారు.

ప్రస్తుత జాతీయ జెండా రూపకర్త తెలుగువాడైన పింగళి వెంకయ్య. దీనిని 1921లో ఆమోదించారు.

మన జాతీయ గీతం ‘వందే మాతరా’న్ని బంకించంద్ర చటర్జీ రచించారు. 1882లో ప్రచురితమైన ఆనంద్‌మఠ్‌ అనే తన నవలలో ఆయన ఈ పాట రాశారు. 1896లో రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ స్వయంగా ఈ గీతాన్ని ఆలపించారు. 1950, జనవరి 24న దీనిని జాతీయ గీతంగా ఆమోదించారు.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి మనకు అధికారికంగా జాతీయ గేయం(నేషనల్‌ ఏంథెమ్‌) లేదు. 1911లో రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ రాసిన ‘భారత భాగ్య విధాత’ అనే గేయాన్ని ‘జన, గణ, మణ’ అని పేరు మార్చి 1950, జనవరి 24న జాతీయ గేయంగా ఆమోదించారు.

పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ జాతీయ గేయాన్ని కూడా రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ రచించడం విశేషం. 1905లో ఆయన రాసిన ‘అమర్‌ సోనార్‌ బంగ్లా’ గేయంలోని మొదటి పంక్తులను 1971లో బంగ్లాదేశ్‌ యథాతధంగా తమ జాతీయ గేయంగా ఆమోదించింది.

1973 వరకూ ఆగస్టు 15న జాతీయ జెండాను రాష్ట్రాల్లో గవర్నర్లే ఆవిష్కరించేవారు. అయితే 1973లో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఈ విషయంపై అభ్యంతరం తెలుపుతూ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాశారు. మరుసటి ఏడాది నుంచి రాష్ట్రాల్లో జాతీయ జెండాను ముఖ్యమంత్రులు ఎగురవేసే సంప్రదాయం మొదలైంది.

మనతో పాటు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, కాంగో రిపబ్లిక్‌, బహ్రయిన్‌, లీక్టెన్‌స్టెయిన్‌ కూడా ఆగస్టు 15 నాడే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి.

భారత దేశంలో చేరిన చివరి రాష్ట్రం గోవా. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పోర్చుగీసు ఆధీనంలోనే ఉన్న గోవా చివరికి 1961లో మన దేశంలో భాగమైంది.

ప్రతీ ఏడాది ఆగస్టు 15న ఢల్లీిలోని ఎర్రకోటపై దేశ ప్రధాని జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ప్రధాన మంత్రులుగా పనిచేసిన గుల్జారీలాల్‌ నందా, చంద్రశేఖర్‌లకు ఆ అవకాశం దక్కలేదు.

ఒకప్పుడు జాతీయ జెండా ఎగుర వేసే సమయం, సందర్భాల్లో కొన్ని ఆంక్షలు ఉండేవి. 2002లో నిబంధనలు మార్చి జెండాను ఇళ్లు, కార్యాలయాలు, ఫ్యాక్టరీల వద్ద ఎగురవేసుకునే అవకాశాన్ని కల్పించారు. 2022 నుంచి రాత్రి వేళ కూడా జెండాను ఎగురవేయడానికి భారత ప్రభుత్వం అనుమతించింది.

Tags:    

Similar News