Chandrababu : నాయుడు గారి "ల్యాండ్ బ్యాంక్" వెనక ఉన్నదెవరు?
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా, రాకపోతే మరోలా ఉంటారన్నది అందరూ చెప్పే మాట.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా, రాకపోతే మరోలా ఉంటారన్నది అందరూ చెప్పే మాట. ప్రస్తుతం రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాల వెనక అదృశ్య శక్తి ఏదో ఉందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి కాదు.. సహజంగానే 1995 నుంచి ఆయన ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకం. ప్రయివేటు సంస్థలతోనే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్ముతారు. అందుకే ఆయన అధికారంలోకి రాగానే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారన్నది మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వారు చెబుతున్న మాట. అందులో కొంత నిజమున్నా.. చంద్రబాబు ఆలోచనలు కూడా ఒకరకంగా కరెక్టేనని అనేవారు కూడా అనేక మంది ఉన్నారు.
అభివృద్ధి చెందిన తర్వాత...
ప్రభుత్వ రంగంలో ఉండేవారు కష్టించి పనిచేయరని, అదే ప్రయివేటు రంగంలో అయితే ఎక్కువ కష్టపడటమే కాకుండా సంపద సృష్టిలో వారు వేగంగా స్పందిస్తారని భావిస్తారు. అందులో ఏ మాత్రం తప్పులేదు. అయితే రాజధాని అమరావతి విషయంలోనూ చంద్రబాబు దూర దృష్టితోనే భూమూలను తీసుకుంటున్నారంటున్నారు. ఎందుకంటే.. తొలినాళ్లలో భూములు తీసుకోకపోతే రాజధాని అమరావతి అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ భూముల ధరలకు రెక్కలు వస్తాయి. అప్పుడు రైతులు కూడా ఇచ్చేందుకు అంగీకరించరు. అందుకే ముందుగానే అవసరానికి మించి ఎక్కువ కొనుగోలు చేసి ప్రభుత్వం వద్ద ఉంచుకుంటే అది అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. తన ఆలోచన పవన్ కల్యాణ్ ముందు ఉంచబట్టే ఆయన కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించారంటున్నారు.
వరసగా భూసమీకరణలు...
అందులో భాగంగానే తొలి దశలో 34 వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించినా.. రెండో దశలో 16,666 ఎకరాలు తీసుకుంటున్నా.. మూడు.. నాలుగు ఇలా అనేక దశల్లో భూసేకరణ ఉంటుందన్నది ప్రభుత్వ వర్గాల అంచనా. రాజధాని అమరావతిలో నిర్మాణాలు పూర్తి కావడానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ మేడేళ్లలో ఇంకొన్ని వేల ఎకరాలను సేకరించి ప్రభుత్వం వద్ద ఉంచుకుంటే భవిష్యత్ ల్యాండ్ బ్యాంక్ గా ఉపయోగపడుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు అధికారులే చెబుతున్నారు. అయితే అభివృద్ధి ఎక్కడ? అని ప్రశ్నిస్తున్న వారికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పనిలేదని, తన పని తాను చేసుకుపోయే పనిలోనే చంద్రబాబు ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే భూసమీకరణ అని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఆలోచన కరెక్టే అయినా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు విఫమయ్యారనే వారు కూడా ఉన్నారు.