KCR : కేసీఆర్ పాలిటిక్స్ ను ఇక వదిలేసినట్లేనా? కీలక నేతలు ఏమంటున్నారంటే?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది

Update: 2025-12-04 12:36 GMT

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనూ ఆయన బయటకు రాలేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయన ఎలాంటి అడుగు వేయలేదు. కనీసం మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇన్ ఛార్జులను పిలిచి కూడా ఒక సమావేశాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేయలేదు. తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. అయినా కేసీఆర్ మాత్రం కనీసం ఎన్నికల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. ఇంకా కేసీఆర్ ఓటమి నుంచి తేరుకోలేకపోతున్నారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది.

ఎన్నికలు జరిగి రెండేళ్లవుతున్నా...
ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్లు కావస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ ను కూడా నిర్వహిస్తుంది. గ్రామస్థాయిలో సమరం ప్రారంభమయిన నేపథ్యంలో గులాబీ బాస్ మౌనం దేనికి సంకేతం అన్నది అర్థం కాకుండా ఉంది. పంచాయతీ ఎన్నికలు అంటే పార్టీ రహితంగా జరిగేవే కావచ్చు. పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ గ్రామాల్లో ఖచ్చితంగా ఆ యా పార్టీలకు సంబంధించిన వ్యక్తులే పోటీలో ఉంటారు. ఖచ్చితంగా పరోక్షంగా పార్టీ అభ్యర్థిగానే చూసి ప్రజలు ఓట్లు వేస్తారు. పంచాయతీ ఎన్నికలకు ఆయన ప్రచారం చేయకపోవచ్చు. కనీసం ప్రకటన కూడా కేసీఆర్ నుంచి రాకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి.
కుటుంబ సమస్యలే కారణమా?
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిపై స్పందించడానికి కూడా కేసీఆర్ బయటకు రావడం లేదు. మరొకవైపు కల్వకుంట్ల కుటుంబలో చీలిక వచ్చింది. ఆయన కుమార్తె తెలంగాణ జాగృతి తరుపున రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు. మరొకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ తిరుగుతున్నారు. మరొకవైపు మేనల్లుడు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ గులాబీ బాస్ గా కేసీఆర్ కనీసం ఫామ్ హౌస్ నుంచిబయటకు రాకపోవడం, నియోజకవర్గాల్లో నేతలకు దిశానిర్దేశం చేయడానికి ఉత్సాహం చూపకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఆయన మరికొంత కాలం బయటకు రారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నప్పటికీ, కీలక సమయాల్లో రాకపోతే ఎలా? అన్న ప్రశ్న క్యాడర్ నుంచి వస్తుంది. మరి కేసీఆర్ ఇప్పటికైనా స్పందిస్తారా? లేదా? అన్నది చూడాలి.



Tags:    

Similar News