Chandrababu : చంద్రబాబు పార్టీని పూర్తిగా వదిలేసినట్లుందిగా?
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని అంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్ ఉన్నారు
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని అంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్ ఉన్నారు. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ఆ పార్టీ ఉనికిని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడా తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ కీలకం. తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టి ఏపీలో రాజకీయ ఇబ్బందులు కొనితెచ్చుకోరు. అందుకే ఆయన గత రెండేళ్ల నుంచి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడానికి అదే కారణం.
ఏపీలో బీజేపీతో పొత్తుతో...
అందులోనూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీలో పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అదే తెలంగాణాలో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీచేయలేని పరిస్థితి కూడా ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. గతంలో అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. దాని ఫలితంగా 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుందామనుకున్నా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అంగీకరించడం లేదు. పరోక్ష సహకారాన్ని కోరతారు తప్పించి, తెలంగాణలో నేరుగా టీడీపీతో పొత్తుకు రాష్ట్ర బీజేపీ నేతలు సిద్ధపడటం లేదు. అందుకే బీజేపీని కాదని తెలంగాణలో పోటీ చేయలేరు. అలాగని పొత్తును కుదుర్చుకోలేరు.
తెలంగాణ టీడీపీ నేతలతో దూరం...
మరొకవైపు తెలంగాణలో తనకు పార్టీ వ్యతిరేకమయినా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు. తన పొలిటికల్ స్కూల్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్లాలనుకోవడం లేదు. అందుకే ఇక తెలంగాణను రాజకీయంగా చంద్రబాబు వదిలిపెట్టినట్లే లెక్కేసుకోవాలి. జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఈ రెండేళ్లలో తెలంగాణ పార్టీ నేతలతో చంద్రబాబు జరిపిన సమావేశాలు కూడా రెండుకు మించవు. ఇక నారా లోకేశ్ కూడా తెలంగాణ టీడీపీని పట్టించుకోవడం లేదు. ఖమ్మం జిల్లాలో కొంత టీడీపీ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించే పరిస్థితి కూడా ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి.ఏపీని గాడిలో పెట్టడానికే ఆయన ఎక్కువ సమయం వినియోగిస్తున్నారు. అప్పడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పటికీ తెలంగాణ టీడీపీ నేతలకు దూరంగా ఉండటాన్ని బట్టి చూస్తే ఇక్కడ కాలు మోపడం కూడా కష్టమేనని ఆయన డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది.