మైండ్ గేమ్ కు ఫుల్‌స్టాప్ పెట్టేశారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విషయంలో రాహుల్ గాంధీ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ప్రత్యర్థుల మైండ్ గేమ్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు

Update: 2022-11-03 04:35 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విషయంలో రాహుల్ గాంధీ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ప్రత్యర్థుల మైండ్ గేమ్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎప్పటి నుంచో ఇది చెబుతున్నా రాహుల్ గాంధీ పాదయాత్రతో ఈ క్లారిటీ మరింత వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ లు కలసి పోటీ చేస్తాయన్న ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం ఈ మధ్య ఎక్కువగా సాగింది. కానీ రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తూ దీనిపై ఆయన స్పష్టత ఇచ్చారు. టీఆర్ఎస్ తో కలిసి పోట ీచేసే ప్రసక్తి లేదని ఆయన ప్రతి సభలో చెప్పకనే చెబుతున్నారు.

వారం రోజుల నుంచి...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో వారం రోజుల నుంచి సాగుతుంది. ప్రతి రోజూ ఏదో ఒక చోట కార్నర్ మీటింగ్ లు కాని, మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. కేసీఆర్ తో కలసి పోటీ చేసే ప్రసక్తి లేదని, కాంగ్రెస్ విడిగానే పోటీ చేస్తుందని ఆయన పదే పదే చెబుతున్నారు. ప్రత్యర్థుల ఆడుతున్న మైండ్ గేమ్ కు ఆయన తెరదించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఆయన యాత్ర జోరుగా సాగుతుంది. అన్ని వర్గాల ప్రజలు ఆయన యాత్రలో భాగస్వామ్యులయ్యేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.
రాష్ట్రాన్ని ఇచ్చిన...
దీంతో పాటు మోదీతో పాటు కేసీఆర్ ను కూడా సమానంగా విమర్శిస్తున్నారు. ప్రతి సభలో రాహుల్ కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటిస్తున్నారు. భూముల కోల్పోయిన నిర్వాసితులను ఆదుకుంటామని చెబుతున్నారు. రైతులకు అండగా నిలబడతామని భరోసా ఇస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు.
కొనసాగిస్తేనే...
రాహుల్ యాత్ర కొంత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ నింపుతుందనే చెప్పాలి. గాంధీ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కష్టపడుతూ సామాన్యులతో మమేకం అవుతున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఆయన వేషధారణ, పలకరింపులు, ఆత్మీయత అంతా కలగలసి పార్టీకి పెద్దయెత్తున మేలు చేకూర్చేలా కనిపిస్తున్నాయి. రాహుల్ యాత్రకు వస్తున్న స్పందన ఆషామాషీగా లేదు. ఈ యాత్ర తెలంగాణలో ముగిసినా ఆ జోష్ తగ్గకుండా ప్రజల్లో ఉండేందుకు కాంగ్రెస్ నిరంతరం ప్రజల్లో ఉండేలా నేతలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే రాహుల్ నడిచిన దూరం.. పడిన శ్రమ వృధాకాక తప్పదు. అది గుర్తుంచుకుని కాంగ్రెస్ నేతలు ఐక్యంగా కలిసి పనిచేస్తే వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News