చంద్రుని కోసం రాలిపోతున్న చుక్కలు!

చంద్రబాబునాయుడు అదృష్ట జాతకుడు. ఆయనకు పెద్దగా గ్లామర్‌ లేదు. ఎన్టీయార్‌, కేసీయార్‌ లాగా జనరంజకంగా ప్రసంగించలేరు. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు. అయినా నలభై ఏళ్లుగా విజయవంతమైన రాజకీయ నాయకుడిగా ఉన్నారు.

Update: 2023-11-13 10:52 GMT

చంద్రబాబునాయుడు అదృష్ట జాతకుడు. ఆయనకు పెద్దగా గ్లామర్‌ లేదు. ఎన్టీయార్‌, కేసీయార్‌ లాగా జనరంజకంగా ప్రసంగించలేరు. కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు. అయినా నలభై ఏళ్లుగా విజయవంతమైన రాజకీయ నాయకుడిగా ఉన్నారు. పద్నాలుగేళ్లు, ముఖ్యమంత్రిగా మరో పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా కీలక పాత్రలు పోషించారు. ఈ విషయంలో ఆయన్ని మించిన లక్కీఫెలో మరొకరు ఉండరు.ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తి, ఇప్పటికీ జనాల నోట్లో ఆయన పేరు నానేలా చేస్తోంది ఆయన మీడియా.  

చంద్రబాబు ఆటలో పావులా మారడానికి ప్రతీసారి ఎవరో ఒకరు సిద్ధంగా ఉంటారు. చంద్రబాబును అవినీతి పరుడిగా నిందించి, మోసగాడిగా విమర్శించే వ్యక్తులే మళ్లీ ఆయనని భుజాన మోయడానికి సిద్ధంగా ఉంటారు. ఇది కూడా ఆయన అదృష్టమే. పదవులు, అధికారాలే పరమావధిగా మారిన నేటి కాలంలో, సిద్ధాంతాల కోసం బతికే నాయకులు దేవతా వస్త్రాల్లాంటివారు. పార్టీలో ఉన్నంతసేపు పక్కపార్టీ నాయకులను నోటికొచ్చినట్లు తిడతారు. పార్టీ మారగానే నాలిక మడత వేస్తారు. తిట్టిన నోటితోనే ఇంద్రుడు, చంద్రుడంటూ పొగుడుతారు. ఇది అన్ని పార్టీల్లోనూ సహజం. చంద్రబాబు విషయానికి వస్తే గతంలో తిట్టిన నోళ్లే ఆయన కోసం త్యాగాలకు సిద్ధపడతారు. ‘చంద్రు’ని మోములో వెలుగు కోసం తాపత్రయపడతారు. ఈ క్రమంలో తమ ఉనికికి ముప్పు వాటిల్లినా, తమ విశ్వసనీయత దెబ్బతిన్నా పట్టించుకోరు. చంద్రబాబులో ఉండే మ్యాజిక్‌ అది.

నేటి రాజకీయాల్లో చంద్రబాబు ప్రయోజనాల కోసం తమ రాజకీయ భవిష్యత్తును కూడా ఫణంగా పెడుతున్న వాళ్లలో ఇద్దరు ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఒకరు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, మరొకరు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇద్దరూ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో వీరు చంద్రబాబును తీవ్రంగా విమర్శించినవారే. ఆ ఇద్దరే ఇప్పుడు చంద్రబాబును ఎలాగైనా ఏపీ ముఖ్యమంత్రిని చేయాలని కంకణం కట్టుకున్నారు.

పవన్‌కు తనపై తనకు అస్సలు నమ్మకం లేదు. గత ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో ఆ నమ్మకం మరింత దెబ్బతింది. ఆయన ఈగో కూడా బాగా హర్టయింది. దీనికి తోడు జగన్‌ మీద పట్టలేనంత ద్వేషం ఉంది. ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని అనుకుంటున్నారు. ఎమ్మెల్యే పదవి కోసం తన రాజకీయ భవిష్యత్తును, పార్లీ భవిష్యత్తును ఆయన తాకట్టు పెడుతున్నారు.

ఏపీలో ఇప్పుడు పొలిటికల్‌ వాక్యూమ్‌ లేదని చెప్పలేం. కాస్త ఓపిగ్గా ఉంటే, సిద్ధాంతాలపై నిలబడితే, పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటే అధికార, ప్రతిపక్ష పార్టీలకు పవన్‌ పోటీ ఇవ్వగలరు.  బలమైన కాపు ఓటు బ్యాంకు కూడా ఆయనకు కలిసి వస్తుంది. ఆయనతో కలిసి నడవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఈ అవకాశాన్ని పవన్‌ ఎందుకు దూరం చేసుకుంటున్నారో ఆయనకే తెలియాలి. గత ఎన్నికల్లో చంద్రబాబును, లోకేష్‌ను తీవ్రంగా విమర్శించిన జనసేనాని ఇప్పుడు తెలుగుదేశం పల్లకిని మోయడానికి సిద్ధపడటం జనసైనికులకు కూడా మింగుడు పడని విషయం.

పురంధేశ్వరి కూడా పేరుకు భాజపా స్థానిక అధ్యక్షురాలైనా తన పార్టీని తెలుగుదేశానికి టీంగా మార్చేశారు. గతంలో చంద్రబాబు తన భర్తను కరివేపాకులా పక్కన పడేసిన సంగతిని ఆమె విస్మరిస్తున్నారు. రాజకీయాల్లో హుందాగా ఉంటారని, తండ్రికి తగ్గ తనయ అని ఆమె పేరు తెచ్చుకున్నారు. కేంద్రమంత్రిగా పదవులు అందుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని ఆమె బీజేపీ పంచన చేరారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలైన తర్వాత పురంధేశ్వరిలో చాలా మార్పు వచ్చింది. తాను ఓ జాతీయ పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్న విషయం మరచిపోతున్నారు. చంద్రబాబును, లోకేష్‌ను భాజపాకు చేరువ చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేనన్ని విమర్శలు గత నాలుగు నెలలుగా ఎదుర్కొంటున్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అయితే తన ట్విట్టర్ను పురంధేశ్వరికి అంకితమిచ్చేశారు. తన పార్టీ అధినాయకత్వం దృష్టిలో, ప్రజల దృష్టిలో తన పరపతి పోతోందని పురంధేశ్వరి గమనించడం లేదు. ఆమె రాజకీయం వల్ల అంతిమంగా చంద్రబాబుకే లబ్ధి చేకూరుతుంది.  ఇలా మరిది కోసం ఆమె తన భవిష్యత్తుని ఫణంగా పెడుతున్నారు. బాబుగారిని అందలం ఎక్కించడానికి మరెంతమంది త్యాగాలకు సిద్ధమవుతారో చూద్దాం.

Tags:    

Similar News