కోస్తాలో మరో ఆనం.. వసంతపై వేటుకు వేళయిందా?

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ , తండ్రి వసంత నాగేశ్వరరావు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయి

Update: 2023-01-10 04:24 GMT

ఎన్నికలు దగ్గర పడే సమయంలో అధికార వైసీపీలో అసంతృప్త నేతలు పెరిగిపోతున్నారు. తమ అసమ్మతిని బహిరంగంగానే బయట పెడుతున్నారు. పార్టీకి ఇది డ్యామేజీ తెస్తుందని తెలిిసినా వైసీపీ నేతలు పార్టీ లైన్ ను థిక్కరించడానికే రెడీ అయిపోయారు. నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో పార్టీ అధినాయకత్వం ఆయనపై చర్యలు తీసుకోకపోయినా వెంకటగిరి నియోజకవర్గం సమన్వయ కర్తగా నేదరుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించింది. అంటే ఒక రకంగా ఆనం రామనారాయణరెడ్డికి పొమ్మన లేక పొగబెట్టినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది.

వసంత కామెంట్స్...
ఇక తాజాగా కోస్తా ప్రాంతంలోనూ వసంత కృష్ణ ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో పాటు అతని తండ్రి వసంత నాగేశ్వరరావు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే విధంగానే ఉన్నాయి. వసంత తండ్రి వసంత నాగేశ్వరరావు విజయవాడ ఎంపీ కేశినేని నానిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దేవినేని ఉమకు వ్యతిరేకంగా కలిశారని భావిస్తున్నా, ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజీ చేశాయని చెప్పాలి. ఆయన కామెంట్స్ తో తనకు సంబంధం లేదని వసంత కృష్ణప్రసాద్ చెప్పినా అధినాయకత్వం మాత్రం సీరియస్ గానే తీసుకుంది.

మైలవరంలో గ్రూపుల గోల...
ఇక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురి మరణానికి కారణమైన ఉయ్యూరు శ్రీనివాస్ ను వెనకేసుకు రావడం పార్టీని ఇబ్బంది పెట్టింది. పార్టీ హైకమాండ్ కూడా వసంత పట్ల కొంత ఆగ్రహంగా ఉందని చెబుతున్నారు. మైలవరంలో గత కొంత కాలంగా వసంత కృష్ణప్రసాద్ సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. మంత్రి జోగి రమేష్ కు చెందిన వర్గం ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. దీనిపై ఇరువురిని పిలిచిన హైకమాండ్ పంచాయతీకి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించింది. వచ్చే ఎన్నికల్లో మైలవరం టిక్కెట్ వసంత కృష్ణప్రసాద్ కు రావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న టాక్ వినపడుతుంది.
మరోమారు కామెంట్స్...
మరోమారు వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం 55 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉందని, ఏనాడూ పోరంబోకులను పక్కన వేసుకుని రాజకీయాలు చేయలేదని వ్యాఖ్యానించారు. చనుమోలు వెంకట్రావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు తరహాలో తాను రాజకీయాలు చేస్తున్నానని, అది ప్రస్తుత పరిస్థితుల్లో వీలుపడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు నాటి రాజకీయాలు నేడు లేవని, ప్రతిపక్షాలపై తాను తప్పుడు కేసులు బనాయించనని, అందుకే తనపై పార్టీలో కొందరికి అసంతృప్తి అని కామెంట్ చేశారు. దీంతో పార్టీ హైకమాండ్ వసంతపై చర్యలు తీసుకోకపోయినా వెంకటగిరి తరహాలోనే సమన్వయ కర్తను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పార్టీ ఇన్నర్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.


Tags:    

Similar News