మేడమ్.. బీఆర్ఎస్ కు భారమయ్యారా?

హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇది బీఆర్ఎస్ నేతలకు తలనొప్పిగా మారింది

Update: 2023-03-07 05:28 GMT

గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇది బీఆర్ఎస్ నేతలకు తలనొప్పిగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీ కూడా నవ్వుల పాలవుతుంది. అయినా ఇదేమీ గమనించని మేయర్ మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్లు, మనసులో అనుకున్న విషయాన్ని బయటకు చెప్పేస్తారు. ఆమె నిజానికి ఫక్తు రాజకీయ నాయకురాలు కాదు. తండ్రి కేశవరావు వారసత్వంతో రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుని తొలి దఫానే ఆమె గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ అయ్యారు.


బాధ్యతలను చేపట్టిన తర్వాత...

మేయర్ గా బాధ్యతలను చేపట్టిన విజయలక్ష్మి వరస వివాదాల్లో చిక్కుకోవడం పార్టీ నేతలకు కూడా చికాకు తెప్పిస్తుంది. కానీ ఆమె తండ్రి కే కేశవరావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఎవరూ బయటకు చెప్పుకోలేకపోతున్నారు. గతంలో ఉన్న మేయర్లు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెద్దగా ట్రోల్ కాలేదు. కానీ విజయలక్ష్మి మాత్రం వారికి అతీతం. ఎందుకంటే ఆమె ఇక్కడ చదువుకున్నా ఎక్కువ కాలం అమెరికాలో ఉండి వచ్చారు. పెళ్లయిన తర్వాత అమెరికా వెళ్లిన విజయలక్ష్మి 2017లో తిరిగి వచ్చారు. దాదాపు 18 ఏళ్ల పాటు అమెరికాలోనే ఉన్నారు.
అమెరికా నుంచి వచ్చి...
మేయర్ విజయలక్ష్మికి ఆ వాసనలు పోయినట్లు లేదు. అందుకే ఆమె కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. ఇటివల అంబర్‌పేట్ లో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై తొలుత మున్సిపల్ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయి కుటుంబానికి సానుభూతితో పాటు క్షమాపణలు కూడా చెప్పారు. అప్పటి వరకూ స్పందించని మేయర్ హడావిడిగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కుక్కలకు మటన్ దొరక్క పోవడం వల్లనే మనుషులపై దాడి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. మటన్ షాపులు మూసి వేసి ఉండటంతో కుక్కలు పిల్లలపై దాడికి దిగుతున్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివాదంగా కూడా మారాయి.

వరస వివాదాలు...
పార్టీ పెద్దలు ఈ వ్యాఖ్యలపై వివరణ అడగకపోయినప్పటికీ ఆమె తన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఇమేజ్ ను దెబ్బతీస్తాయని భావించి వెంటనే బాలుడి కుటుంబానికి పరిహారం ప్రకటించారు. ఇక తాజాగా మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తూ ఎవరో ఒకరిపై దాడులు చేస్తే తనను ట్రోల్ చేేశారంటూ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిజానికి కుక్కలదాడిలో మరణించిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన మేయర్ ఆ పనిమానుకుని తనను కావాలని ట్రోల్ చేస్తున్నారనడంపై నెటిజన్లు మండి పడుతున్నారు. సహచర కార్పొరేటర్లు కూడా మేయర్ విజయలక్ష్మి వైఖరిపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేయర్ తాను ప్రసంగించేటప్పుడు వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపైనే ఉంది. లేకుంటే బీఆర్ఎస్ కు భారంగా మారనుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో మేయర్ వైఖరి ప్రభావం పడే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News