పాపం కొత్తపల్లి... అపాయింట్‌మెంట్ కూడా లేదట

కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. కానీ జిల్లా నేతలు మాత్రం ఆయన చేరికకు అంగీకరించడ లేదు

Update: 2023-03-12 04:14 GMT

ఒకటిన్నర దశాబ్దమయింది. ఆయన చట్టసభల్లో అడుగు పెట్టి. రాజకీయ నేతకు ఇది పెద్ద సమయమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మూడు ఎన్నికల్లో వరసగా చట్టసభల్లోకి అడుగు పెట్టలేదంటే ఇక ఆ నేత రాజకీయంగా కనుమరుగయినట్లే అనుకోవవాల్సి ఉంటుంది. ఆయనే కొత్తపల్లి సుబ్బారాయుడు. ఆయన మారని పార్టీ అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదీ లేదు. కమ్యునిస్టు పార్టీలు మినహా అన్ని పార్టీల కండువాలను కొత్తపల్లి దాదాపు కప్పుకున్నారు. కానీ 2009 ఎన్నికల నుంచి ఆయనకు లక్ కలసి రావడం లేదు. 2012లో గెలిచినా రెండేళ్లకే ఆయన ఎమ్మెల్యే పదవికి పరిమితమయ్యారు.

2004 వరకూ...
2004 వరకూ ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో విద్యుత్తు శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఒక రకంగా పశ్చిమగోదావరి జిల్లాను నాడు తన కనుసైగలతోనే కొత్తపల్లి శాసించాడని చెప్పాలి. జిల్లాలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నా కొత్తపల్లి సైగ చేస్తేనే దక్కేది. అంతగా కొత్తపల్లి సుబ్బారాయుడు హవా సాగేది. 1989లో తెలుగుదేశం పార్టీలో చేరిన కొత్తపల్లి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. కాపు సామాజికవర్గం నేతగా పార్టీ హైకమాండ్ కు కూడా నమ్మకంగా ఉండటంతో ఆయన మాట చెల్లుబాటు అయ్యేది.

 అనేక పార్టీలు మారి...
అలాంటి కొత్తపల్లి సుబ్బారాయుడు 2009లో తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని మార్చేసింది. ప్రజారాజ్యం పార్టీలో చేరడంతో అప్పటి నుంచి ఆయన పార్టీలు మారుతూనే ఉన్నారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా నాలుగు పార్టీలు అతి కొద్దికాలంలోనే మారారు. టీడీపీలో ఆయనకు కాపు కార్పొరేషన్ పదవి అయినా దక్కింది. వైసీపీలోకి వెళితే అది కూడా దక్కలేదు. దీంతో నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. దీంతో వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. త్వరలోనే తాను ఏ పార్టీలో చెబుతానన్న కొత్తపల్లి నెలలు గడుస్తున్నా చెప్పలేకపోతున్నారు. ీకొత్తపల్లిపై నమ్మకం లేకనే ఏ పార్టీ ఆయనను చేర్చుకోలేకపోతుందన్న టాక్ వినపడుతుంది.
టీడీపీలో చేరాలనుకున్నా...
తిరిగి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా నేతలు మాత్రం ఆయన చేరికకు అంగీకరించడ లేదని తెలిసింది. అనేక మంది నేతలు కొత్తపల్లి రాకపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నేతల నుంచి వస్తున్న వత్తిడుల దృష్ట్యా చంద్రబాబు కూడా కొత్తపల్లి చేరికకు ఇప్పటి వరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇటీవల తారకరత్న భౌతికకాయాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కొత్తపల్లి చంద్రబాబుని విష్ చేసినా ఆయన పట్టించుకోలేదని చెబుతున్నారు. అక్కడ రాజకీయ విషయాలు చర్చించేందుకు సరైన సమయం కాకపోయినా కొత్తపల్లికి అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తపల్లి మాత్రం 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. మరి ఆయనకు మిగిలింది జనసేన మాత్రమే. జనసేన కూడా ఆయనను నమ్మి టిక్కెట్ ఇస్తుందా అన్నది సందేహమే. చూడాలి మరి కొత్తపల్లి ఏ పార్టీలో చేరి పోటీ చేయనున్నారన్నది.


Tags:    

Similar News