కొండ్రు కనిపించక పోవడానికి కారణం అదేనా?

కోండ్రు మురళి 2019 ఎన్నికలలో రాజాం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో ఓడిపోయారు.

Update: 2021-11-28 08:03 GMT

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ నేత కోండ్రు మురళి టీడీపీలోనే ఉన్నారా? అంటే ఉన్నారంటే ఉన్నారనుకోవాలి. లేదంటే లేదనుకోవాలి. కోండ్రు మురళి 2019 ఎన్నికలలో రాజాం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన కోండ్రు మురళి చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. టీడీపీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ కోండ్రు మురళి యాక్టివ్ గా లేకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.

ఆరోజు కూడా...
ఆ మధ్య చంద్రబాబు పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడిని నిరసిస్తూ 36 గంటల పాటు దీక్ష చేసినప్పుడు కూడా కోండ్రు మురళి కన్పించలేదు. ఆయనను పార్టీలోకి కళా వెంకట్రావు తీసుకొచ్చారు. ఆయన పరిస్థితే ప్రస్తుతం బాగా లేదు. మరోవైపు టీడీపీ అధినాయకత్వం మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు రాజాం నియోజకవర్గంలో మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం. రాజాంలో ఇప్పుడు పార్టీ నాయకత్వం గ్రీష్మనే నేతగా చూస్తుందనే అనుమానమూ లేకపోలేదు.
అచ్చెన్నకు దూరంగా...
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నప్పటికీ కోండ్రు మురళి ఇప్పటి వరకూ ఆయనను కలిసే ప్రయత్నం చేయలేదు. ఆయనను కలిస్తే రాజాంలో కళా వెంకట్రావు వర్గం దూరమవుతుందని కాబోలు. గ్రీష్మకు లోకేష్ మద్దతు లభిస్తుందని తెలిసి కోండ్రు మురళి సైలెంట్ గా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే పదవి లేక, గెలిచి పదేళ్లు కావస్తుంది. వచ్చే ఎన్నికలు ఆయన రాజకీయ భవిష్యత్ ను నిర్దేశించేవని చెప్పాల్సిన పనిలేదు.
టీడీపీలో లాభం లేదని....
అందుకే కోండ్రు మురళి టీడీపీని వీడాలని భావిస్తున్నారు. టీడీపీ లో విభేదాలతో పాటు రాజాం నియోజకవర్గంలో టీడీపీ నేతల వల్లనే తాను ఓటమి చెందానని భావించడం వల్ల ఆయన ఆ పార్టీలో ఇమడ లేక పోతున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంభాల జోగులుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన ఇప్పటికే మూడు సార్లు విజయం సాధించారు. ఈసారి వైసీపీ అభ్యర్థిని మారుస్తుందని చెబుతున్నారు. అందుకే కోండ్రు మురళి వైసీపీ వైపు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News