Telangana Global Summit : పెట్టుబడులు ఈసారి తెలంగాణలో దంచి కొట్టనున్నాయా?

తెలంగాణలో నేటి నుంచి గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభం కానుంది

Update: 2025-12-08 04:35 GMT

తెలంగాణలో నేటి నుంచి గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ గ్లోబల్ సమ్మిట్ కు దాదాపు ఐదు వేల మంది వరకూ ఆహ్వానాలు పంపారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు ఈ గ్లోబల్ సమ్మిట్ కు హాజరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా సుమారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరగనున్నాయని తెలిసింది. ఈ మేరకు అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిసింది.

లక్షల మందికి ఉపాధి అవకాశాలు...
పేరున్న ప్రముఖ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో పెట్టుబడులపై ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు సమాచారం. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఒప్పందాలు దిగ్గజ కంపెనీలతో ఉంటాయని మంత్రి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పారిశ్రామిక విధానం పట్ల ఆకర్షితులైన కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, అందులో గూగుల్ కూడా ఉందని తెలిపారు. అలాగే సాఫ్ట్ వేర్ కంపెనీలు అనేకం తమ పెట్టుబడులతో విస్తరణకు కూడా సిద్ధపడుతున్నాయని చెప్పారు.
అనేక సంస్థలు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని చేర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తామని చెప్పడం వెనక కూడా అత్యధిక పెట్టుబడులు వస్తాయన్న నమ్మకంతోనేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, క్రీడాభివృద్ధికి సంబంధిత పెట్టుబడులు అధికంగా రానున్నాయని తెలిసింది. మరొకవైపు ఈ గ్లోబల్ సమ్మిట్ కు సాధారణ ప్రజలను కూడా అవకాశం కల్పిస్తున్నారు. అయితే 8,9 తేదీల్లో కాకుండా పదో తేదీ నుంచి పదమూడో తేదీ వరకూ ఉచిత ప్రవేశాన్ని అందరికీ కల్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజలను తిలకించే అవకాశాన్ని కల్పించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేసింది.
నిరంతర విద్యుత్తు సరఫరా...
ఈ నెల 8, 9న భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. వేదికకు ప్రత్యేక అండర్‌గ్రౌండ్ లైన్ ను ఏర్పాటు చేశారు. 33/11 కేవీ మీర్‌ఖాన్పేట్‌ సబ్‌స్టేషన్‌ నుంచి సమ్మిట్ వేదిక వరకు రెండు కిలోమీటర్ల డబుల్ సర్క్యూట్ అండర్‌గ్రౌండ్ కేబుల్ వేసినట్టు చెప్పారు. ప్రాంగణంలో ఒక్కటి 100 kVA, రెండు 160 kVA, రెండు 315 kVA ట్రాన్స్‌ఫార్మర్లు వివిధ స్థానాల్లో ఏర్పాటు చేశారు. అదనంగా 315 kVA మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సిద్ధంగా ఉంచారు. శనివారం నుంచి సమ్మిట్ ముగిసే వరకు సుమారు 150 మంది అధికారులు, సిబ్బంది విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించనున్నారు. అక్కే ఉండి విద్యుత్తుకు అంతరాయం కలగకుండా చూసేలాచర్యలు తీసుకుంటారు.


Tags:    

Similar News