ఇండిగో...నాయుడు గారి అబ్బాయి.. ఇలా ఇరుక్కున్నాడేంటమ్మా?
ఇండిగో విమాన ప్రయాణికులకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
ఇండిగో విమాన ప్రయాణికులకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఒక్కరోజే వెయ్యి విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు.ఈరోజు కూడా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దుతో ఎయిర్‌పోర్ట్‌లలో పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఈ నెల 15లోగా సమస్య పరిష్కారం ఇండిగో సీఈవో అవుతుందంటున్నారు. సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకునే విమానాల్ని రద్దు చేశామని అన్నారు. సిస్టమ్ రీబూట్ వల్ల విమానాలు రద్దు చేయాల్సి వస్తుందని ఇండిగో సీఈవో తెలిపారు. అయితే ఈ వివాదం పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ సయితం ఈ పరిస్థితిపై సీరియస్ అయినట్లు తెలిసింది.
ఏడాది గడుస్తున్నా...
పౌర విమానయాన శాఖలో డీజీసీఏ నిబంధనలను తెచ్చి ఏడాదవుతున్నప్పటికీ ఇండిగో సన్నద్ధతపై కనీసం అధికారులు దృష్టి పెట్టకపోవడంపై ప్రధాని మోదీ ఒకింత అసహనానికి గురయినట్లు చెబుతున్నారు. అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. పౌర విమానయాన శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా దీనికి బాధ్యత తీసుకోవాలంటూ జాతీయ మీడియాలో హోరెత్తిపోతుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా రంగంలోకి దిగి కేంద్ర పౌరవిమాన యాన శాఖ అధికారులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. జాతీయ మీడియాలో ప్రయాణికుల అవస్థలపై వరస కథనాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
ప్రత్యేక కమిటీ వేశాం...
ఇండిగో వివాదంపై ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణకు ఆదేశించామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికులకు అత్యవసరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, రేపు రాత్రి 8 గంటలలోపు రీఫండ్ చేయాలని ఇండిగోను ఆదేశించామని తెలిపారు.విమాన టికెట్ల ధరలు పెంచకూడదని ఆదేశాలు ఇచ్చామన్నార. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిందని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మొత్తం మీద ఇండిగో సంక్షోభం తెలుగుదేశం పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు మెడకు చుట్టుకునేలా కనపడుతుంది. అయితే ఇండిగో కావాలనే చేసిందన్న అనుమానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కూడా ఆదేశించింది.