Kilari Rosaiah : రోశయ్య ఎక్కడ.. జనసేనలో ఉన్నారా? పెద్ద డౌటేగా?

కిలారి రోశయ్య జనసేనలో చేరాక కనిపించకుండా పోయారు.

Update: 2025-12-08 08:10 GMT

కిలారి రోశయ్య జనసేనలో చేరాక కనిపించకుండా పోయారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్యకు 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ పొన్నూరు టిక్కెట్ ఇచ్చారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పై కిలారి రోశయ్య గెలవడంతో ఉమ్మారెడ్డి లెగసీని అందిపుచ్చుకుంటారని భావించారు. 2024 ఎన్నికల వరకూ కిలారి రోశయ్య వైసీపీలోనే కొనసాగారు. ధూళిపాళ్ల నరేంద్ర కు వ్యతిరేకంగా అనేక విమర్శలు చేశారు. అయితే ఆయన 2014 ఎన్నికల తర్వాత తన రాజకీయ ప్రయాణం వైసీపీలో సాఫీగా సాగే అవకాశం లేదని భావించి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేన కండువా కప్పుకున్నారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు.

నాడు వైసీపీ నుంచి వీడి...
వ్యక్తిగత కారణాల వల్ల తాను పార్టీని వీడుతున్నట్లు నాడు జగన్ కు రాసిన లేఖలో కిలారు రోశయ్య పేర్కొన్నారు. వైసీపీ వీడి జనసేనలో చేరిన తర్వాత కిలారి రోశయ్య ఎక్కడా కనిపించడం లేదు. ఆయన పొన్నూరుకు వెళ్లినా పెద్దగా పట్టించుకునే వారు లేరు. అలాగే జనసేన స్థానిక నేతలు కూడా కిలారి రోశయ్యను దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. అస్సలు పొన్నూరు జనసేన నేతలు కిలారి రోశయ్యను తమ నేతగా కూడా గుర్తించడం లేదు. కేవలం పొన్నూరు మాత్రమే కాదు.. గుంటూరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఆయనకు జనసేన నేతగా గుర్తింపు ఇంత వరకూ దొరకలేదు. వైసీపీని వీడటానికి ప్రధాన కారణం తన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వలేదని ఆయన పార్టీనివదిలి వెళ్లారని అప్పట్లో ప్రచారం జరిగింది.
ఏడాదిన్నర నుంచి...
కానీ జనసేనలో కిలారి రోశయ్య చేరి ఒకటిన్నర సంవత్సరం దాటుతున్నప్పటికీ జనసేనలోనూ ఆయనకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడిగానే ఆయనకు గుర్తింపు ఉంది. జనసేన పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. అసలు కిలారి రోశయ్య జనసేనలో ఉన్నారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా హైదరాబాద్, గుంటూరుకు మాత్రమే కిలారి రోశయ్య పరిమితమయ్యారని తెలిసింది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఆయన జనసేనలోనూ అంత సంతృప్తికరంగా లేరని అంటున్నారు. త్వరలోనే ఆయన జనసేనకు కూడా గుడ్ బై చెప్పి తిరిగి వైసీపీలో చేరతారన్న ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. కానీ వైసీపీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ ఇంకా లభించకపోవడంతో ప్రస్తుతానికి జనసేన నేతగానే ఆయన పూర్తి స్థాయి విశ్రాంతిలో ఉన్నారని చెబుతున్నారు.


Tags:    

Similar News