Weather Report : ఫ్యాన్ తిరగడం లేదు.. దుప్పట్లను వదలడం లేదు
ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలిగాలుల తీవ్రత పెరిగిపోయింది.
ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలిగాలుల తీవ్రత పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలిగాలుల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చలివాతావరణం నెలకొందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. దిత్వా తుపాను అల్పపీడనంగా బలహీనపడి అది తీరం వెంట పయనించిన నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏజెన్సీ ఏరియాల్లో...
ఆంధ్రప్రదేశ్ లో పొడి వాతావరణం ఉన్నప్పటికీ చలిగాలుల తీవ్రత ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. పాడేరు, అరకు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఏజెన్సీ గ్రామ ప్రాంత ప్రజలు చలి మంటలతో వెచ్చదనాన్నితెచ్చుకుంటున్నారు. ఉదయం పన్నెండు గంటల వరకూ చలిగాలుల తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలితీవ్రత మరింత పెరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
పగలు.. రాత్రి తేడా లేకుండా
తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఫ్యాన్స్ ఆగిపోయాయి. విద్యుత్తు వినియోగం కూడా పూర్తిగా తగ్గిపోయింది. పగలు, రాత్రి వేళ విద్యుత్తు వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా తక్కువగా జరుగుతుందని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఇళ్లలో ఉన్న వారు బయటకు రావడం కూడా కష్టంగా మారింది. సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లో రోడ్లన్నీ కర్ఫ్యూ విధించినట్లు మారిపోతున్నాయి. స్వెట్టర్లకు డిమాండ్ పెరిగింది. గీజర్ల వాడకం వల్లనే కొద్దో గొప్పో విద్యుత్తు వినియోగం జరుగుతుంది. మరికొద్ది రోజుల పాటు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ వ్యాధులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.