Cyber Crime : సైబర్ నేరగాళ్లు ఎంచుకుంటుంది వాళ్లనే.. మీరు వారి జాబితాలో ఉన్నారా?
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వ్యాపారులను, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మరీ సైబర్ నేరగాళ్లు కోట్లు దోచుకుంటున్నారు. తాజాగా డిజిటల్ అరెస్ట్ పేరుతో హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపారి నుంచి 1.83 కోట్ల రూపాయలను కాజేశారు. సైబర్ నేరాలపై ఎంతగా ప్రచారం చేసినప్పటికీ డిజిటల్ అరెస్ట్ అనగానే భయపడి నేరగాళ్లు అడిగినట్లు అడిగింది చేస్తుండటంతో సొమ్మును కోల్పోతున్నారు. ఎంత అవగాహన కల్పించినా నేరగాళ్లు ఎంచుకునే వారిలో స్పెషాలిటీ ఉండటంతో సులువుగా వారి బుట్టలో పడిపోతున్నారు. ఇప్పటి వరకూ డిజిటల్ అరెస్ట్ అంటే సీబీఐ, సీఐడీ, ఈడీ అనే పేర్లను ఎక్కువగా వాడి బుట్టలో వేసుకునే వారు. దీంతో భయపడి డబ్బులు పంపేవారు. కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో కొంత వరకూ తగ్గింది.
ఈ సారి మరొక రూట్ లో...
కానీ హైదరాబాద్ లో జరిగిన ఘటన చూస్తే అందుకు విరుద్ధంగా నేరగాళ్లు సైబర్ క్రైమ్ కో -ఆర్డినేషన్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పడం విశేషం. దీంతో బాధితులు భయపడిపోయారు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ వ్యాపారితో పాటు ఆయన భార్యను కూడా భయపెట్టారు. మహిళల అక్రమరవాణాలో కేసులో మీ పేరు ఉందని చెప్పి భయపెట్టారు. అసలు తమకు సంబంధం లేకపోయినా సైబర్ నేరగాళ్లు కేసు పెడతామని చెప్పడం, స్టేషన్ కు రావాల్సి ఉందని, రాకపోతే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పడంతో ఆ వ్యాపారి దంపతులు భయపడిపోయారు. హైదరాబాద్ మోకిలాకు చెందిన వ్యాపారిని ఈసారి సైబర్ నేరగాళ్లు ఎంచుకున్నారు.
బెంగళూరు మహిళ వేదింపు కేసులో...
ఆ వ్యాపారి వ్యాపార నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళుతుంటారు. దీన్నిఆసరాగా చేసుకుని బెంగళూరులో ఒక మహిళను వేధించిన కేసులో వ్యాపారి నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. అయితే తనకు ఏం సంబంధం లేదని ఆ వ్యాపారి చెప్పినప్పటికీ కేసు నమోదయిందని, మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. దీంతో వారి ఆధార్ నెంబరు కూడా తీసుకున్నారు. వరసగా నలుగురైదుగురు పోలీసు అధికారులమని చెప్పి బెదిరించారు. వీడియో కాల్ చేయాలంటూ వృద్ధ దంపతులను బెదిరించారు. వ్యాపారి నుంచి అతని బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకున్నారు. మూడు నెలల పాటు తమ కస్టడీలో ఉండాలంటూ భయపెట్టారు.
తమ బ్యాంకు ఖాతాల్లో వేసుకుని...
మరీ అన్ని వివరాలను తెలుసుకుని, తాము చెప్పిన ఖాతాల్లో నగదు జమ చేస్తే దర్యాప్తు ముగిసిన తర్వాత డబ్బు రీఫండ్ చేస్తామని చెప్పారు. మొత్తం 1.83 కోట్ల రూపాయలను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. అంతటితో వదలకుండా భూములు, బంగారం గురించి సెర్చ్ చేయాలని, మీ ఇంటికి వస్తామని చెప్పడంతో వ్యాపారి సన్నిహితులకు విషయం చెప్పగా అది ఫేక్ అని తేల్చారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్, సుప్రీంకోర్టు వంటి పేర్లు చెప్పినా భయపడవద్దని ప్రచారం చేస్తున్నా ఇంకా వారి వలలో పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ ఫోన్ వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఎలాంటి వివరాలు పంపవద్దని పోలీసులు కోరుతున్నారు.