Tirumala : తిరుమలలో ఈరోజు వెళ్లే వారికి గుడ్ న్యూస్

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.

Update: 2025-12-08 02:38 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. ఈరోజు మాత్రం సాధారణంగానే కొనసాగుతుంది. కంపార్ట్ మెంట్లలో పెద్దగా వేచి ఉండకుండానే స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. సాధారణంగా ఉన్న రోజుల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా స్వామి వారిని కనులారా చూసేందుకు అవసరమైన చర్యలను టీటీడీ తీసుకుంటుంది.

నెలాఖరు నుంచి...
తిరుమలలో భక్తుల రద్దీ ఈ నెలాఖరు నుంచి ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. డిసెంబరు 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు ఇప్పటికే లక్షలాది మంది ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నారు. వారికి లక్కీ డిప్ ద్వారా స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చేవారిని ఎంపిక చేసి వారికి సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇస్తున్నారు. ఇప్పటి నుంచే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ అధికారులు ప్రారంభించారు. వసతి గృహాలు చాలకపోతే తిరుపతి నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పన్నెండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,343 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,505 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.69 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News