Telangana: డాబుసరితనం లేదు.. గొప్పలు చెప్పు కోలేదు..గ్లోబల్ సమ్మిట్ పై ప్రశంసలు

తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

Update: 2025-12-08 11:48 GMT

తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ తరహాలో కాకుండా విభిన్న తరహాలో ఈ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించడం అందరి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ఔత్సాహికులు వస్తే తాము ఎంఓయూలు చేసుకుంటామని, అంతే తప్ప ఇది పెట్టుబడుల కోసం జరుగుతున్నసదస్సు కాదని ముందే చెప్పిన ప్రభుత్వం విమర్శకుల నోళ్లను మూయించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసి తమ లక్ష్యాలను ప్రపంచానికి తెలియజేసే వేదికగా మాత్రమే రేవంత్ రెడ్డి మలచుకునే ప్రయత్నం చేశారు.

ఇతర నేతలకు భిన్నంగా...
ఒకరకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో నేతలకు వ్యవహరించిన భిన్నంగా రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారని చెప్పాలి. గతంలో అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని,మొన్న అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నిర్వహించిన విశాఖ పెట్టుబడుల సదస్సులో పదమూడు లక్షల కోట్లు వచ్చాయని చెప్పి డప్పాలు కొట్టుకుంది. కానీ వారు కుదుర్చుకున్న ఎంవోయూలు, వివిధ పారిశ్రామికవేత్తలతో చేసుకున్నఒప్పందాలు అమలుకు నోచుకోక ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. నాడు వైసీపీ కానీ, నేటి కూటమి ప్రభుత్వం కాని పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా వచ్చి పడ్డాయని చెప్పే ప్రయత్నమే చేసింది.
విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయడానికే...
కానీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఆ రకమైన పోకడలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించలేదు. 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేశారు. తమ విధానాల ద్వారా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నాన్ని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వారికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. పెట్టుబడుల కోసం ఇతర దేశాలకు వెళ్లి అక్కడ పారిశ్రామికవేత్తలను కలవలేదు. హడావిడి చేయలేదు. కేవలం ఆహ్వానం మాత్రమే పంపారు. వారు వచ్చేది లేనిదీ సమాచారాన్ని ఫోన్, మెయిల్స్ ద్వారానే సమాచారం తెలుసుకుని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అందుకు అనుగుణంగానే గ్లోబల్ సమ్మిట్ ప్రణాళికను రూపొందించుకున్నార.
లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయంటూ...
అంతేతప్ప డాబుసరి తనానికి పోయి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఊదరగొట్టే ప్రయత్నం చేయకపోవడం నిజంగా ఇతర రాష్ట్రాల పాలకులు కూడా చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమల ఏర్పాటుకు సదస్సులు ఏర్పాటు చేయాలే తప్ప కేవలం పెట్టుబడుల కోసమే కాకుండా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఏ రకమైన ప్రయోజనాలు పారిశ్రామికవేత్తలకు అందుతాయి? వారి పెట్టుబడులకు ఏ మేరకు భరోసా ఉంటుందన్నది తెలియజేస్తే చాలు ఆటోమేటిక్ గా పెట్టుబడులు వచ్చిపడతాయి. అదే రేవంత్ ప్రభుత్వం అనుసరించింది. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు, నేతలు కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలను, నిరుద్యోగులను మభ్యపెట్టినట్లే అవుతుంది. అసలు విషయం తక్కువ సమయంలోనే తెలిసిపోతుంది. తర్వాత అపహాస్యం పాలవ్వకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహరించిన తీరు అనుసరణీయం. అభినందనీయం


Tags:    

Similar News