గవర్నర్ ఇక స్పీడ్ పెంచబోతున్నారా?
తెలంగాణలోనూ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కీలక భూమిక పోషించే అవకాశాలున్నాయంటున్నారు.
తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. యుద్ధం మొదలయిందనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండటంతో వార్ మరింత ముదిరినట్లే. తాను మోదీతోనే యుద్ధానికి దిగానన్న సంకేతాలను కేసీఆర్ బలంగా పంపగలిగారు. ప్రధాని హోదాలో మోదీ రాష్ట్రానికి వస్తే కనీసం ఆయన వైపు కన్నెత్తి కూడా చూడకుండా కేసీఆర్ కమలం పార్టీతో కయ్యానికి సిద్ధమయినట్లే కన్పిస్తుంది.
అన్ని రాష్ట్రాల్లో.....
అయితే అన్ని రాష్రాల్లో బీజేపీ గవర్నర్ ను ప్రయోగించడం ఆనవాయితీగా వస్తుంది. పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ తో ఎన్నికలకు ముందు మమత బెనర్జీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా గవర్నర్ తప్పు పట్టేవారు. మమత వర్సెస్ గవర్నర్ గా ఎన్నికలకు ముందు పెద్దయుద్ధమే నడిచింది. ఇక ఢిల్లీ, పాండిచ్చేరిల సంగతి మనకు తెలియంది కాదు. ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టే విధంగా లెఫ్ట్ నెంట్ గవర్నర్లు వ్యవహరించారు.
ఇప్పటికే దూరం....
ఇప్పుడు తమిళనాడులోనూ గవర్నర్ తో ముఖ్యమంత్రి స్టాలిన్ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కీలక భూమిక పోషించే అవకాశాలున్నాయంటున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తమిళి సై చుక్కలు చూపించే అవకాశాలున్నాయని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ పెరిగింది.
రానున్న రోజుల్లో....
మోదీ పర్యటన తర్వాత గవర్నర్ మరింత దూకుడు పెంచుతారంటున్నారు. మోదీని కలవకుండా రాజ్యాంగాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కేసీఆర్ అవమానపర్చారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరో ఏడాదిన్నర ఎన్నికలకు సమయం ఉంది. ఈ కాలంలో గవర్నర్ వర్సెస్ సీఎంగా అనేక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రధానిని అవమానించారన్న అభిప్రాయంతో ఉన్న బీజేపీ గవర్నర్ ను ప్రయోగిస్తారన్న టాక్ బలంగా వినపడుతుంది. మరి తమిళి సై స్పీడ్ ను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.