Andhra Pradesh : అదిగో.. అల్లదిగో మంత్రి వర్గ విస్తరణ.. జాబితా రెడీ అయిందా?

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు వచ్చే ఏడాది జరిగే అవకాశాలున్నాయి

Update: 2025-12-07 07:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు వచ్చే ఏడాది జరిగే అవకాశాలున్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ ను కలవడంతో మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి చర్చలు ఏమైనా జరుపుతారేమోనని భావించారు. కానీ నూతన రాజధాని అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో చర్చించారని తెలిసి ఆశావహులు నిరాశలో మునిగిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కొందరిపై చంద్రబాబు సయితం అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా మంత్రులు వైసీపీకి కౌంటర్లు ఇవ్వడంలో వెనక బడి ఉంటున్నారని ఆయన భావిస్తున్నారు.

మంత్రుల పేషీల్లో...
ఇక మరికొందరి మంత్రులపైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. మంత్రుల కుటుంబ సభ్యులతో పాటు వారి పీఏలకు సంబంధించిన వ్యవహారం కూడా పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. సాధారణంగా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ విస్తరణ ఆయన గతంలో మూడేళ్లు ఉన్న సమయంలో తక్కువ సార్లు మాత్రమే చేశారు. అయితే అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగా లేని వారిని తప్పించడానికి మాత్రమే పరిమితమయ్యారు. నాడు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో అందరూ సీనియర్ నేతలుండేవారు. అందుకే పెద్దగా ఎవరినీ రెండు, రెండున్నరేళ్లలో తప్పించి మరొకరికి అవకాశం ఇచ్చే వారు కాదు. సామాజికవర్గాలు, ప్రాంతాల వారీగా మంత్రివర్గ కూర్పును చంద్రబాబు చేపట్టేవారు.
కొత్త ఏడాదిలో ఖచ్చితంగా...
కానీ ఈసారి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవి దక్కింది. తొలిసారి ఎమ్మెల్యే అని చూడకుండా సామాజికవర్గంతో పాటు ప్రాంతాన్ని, జిల్లాను పరిగణనలోకి తీసుకుని వారికి మంత్రి పదవులు కేటాయించారు. కానీ ప్రస్తుతం చాలా మంది మంత్రి వర్గ సభ్యుల్లో ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తున్నా తమ శాఖపై పట్టుపెంచుకోలేదు. మరొకవైపు మరో మూడేళ్లలో ఎన్నికలకు వెళ్లాల్సిన సమయంలో బలమైన గొంతుకలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారు. కొత్త ఏడాది ఖచ్చితంగా మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందంటున్నారు. కొత్త ఏడాదిలో సీనియర్ నేతలతో పాటు జూనియర్లలో సామాజికవర్గాలు, ప్రాంతాల వారీగా ఎంపిక చేసి ఆయన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి ఈ రకమైన సంకేతాలు రావడంతో వారు శుభముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారట. మరి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.


Tags:    

Similar News