Free Bus For Women : ఫ్రీ బస్సు ఎంత పనిచేస్తుందయ్యా? మొన్న కర్ణాటక.. నిన్న తెలంగాణ.. ఏపీ ఎప్పుడు?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మిగిలిన ప్రయాణికులపై భారంగా మారింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మిగిలిన ప్రయాణికులపై భారంగా మారింది. మొన్న కర్ణాటక.. నిన్న తెలంగాణ.. మరి ఆంధ్రప్రదేశ్ వంతు ఎప్పుడు? అన్నదే ఇప్పుడు చర్చ. దేశంలో ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే దీనివల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు నష్టాలు వస్తున్నాయన్నది అంతే వాస్తవం. నిర్వహణ వ్యయం కూడా పెరిగిందంటున్నారు. ఎక్కువ బస్సులతో పాటు అదనపు సిబ్బంది నియామకాలతో ఆర్టీసీ సంస్థ నష్టాల రూట్లో నడుస్తున్నాయి. దీంతో మిగిలిన ప్రయాణికులపై ఈ భారం మోయక తప్పడం లేదు. ఎన్ని నెలలని ఆర్టీసీని ప్రభుత్వం నిధులిచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తుందన్నది ఇక్కడ కలుగుతున్న సందేహం.
కర్ణాటకలో భారంగా మారి...
కర్ణాటకలో ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు కేటాయించింది. అయితే కొన్ని నెలల తర్వాత కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రభుత్వానికి భారంగా మారింది. దీంతో ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు దాదాపు 400 కోట్ల రూపాయల ఖర్చవుతుండటంతో ఆ భారం మోయలేని ప్రభుత్వం ఇప్పుడు ఛార్జీలను పెంచింది. బస్సు టికెట్ ధరలను 15 శాతం పెంచేందుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లోఈ ఏడాది జనవరి ఐదో తేదీ నుంచి పెరిగిన కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయని మంత్రి పాటిల్ తెలిపారు. ఛార్జీల పెంపుదలతో రోజుకు ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని భావించి ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.
తెలంగాణలోనూ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ...
తాజాగా తెలంగాణలోనూ ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ ఇక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండేళ్లు భారంగానే మోసింది. కానీ ఇప్పుడు ఛార్జీలు పెంచక తప్పేట్లు కనిపించకపోవడంతో ముందు హైదరాబాద్ లో బస్సు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టిక్కెట్ ధరపై పది రూపాయలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో కూర్చోడానికి సీటు దొరకక ప్రయాణించే వారు అదనంగా డబ్బులు చెల్లించాలని భారం మోపడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ ఇప్పుడు కాకపోతే.. మరికొన్నాళ్ల తర్వాతనైనా ఆర్టీసీ ఛార్జీల భారం ప్రయాణికులపై పడే అవకాశముంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.