రోశయ్య... గాంధీభవన్.. విడదీయలేని అనుబంధం

రోశయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత. ఆయన ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చేవారు.

Update: 2021-12-04 03:45 GMT

రోశయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత. ఆయన ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చేవారు. రోశయ్య అసెంబ్లీలో ఉన్నారంటే అధికార పక్షానికి కూడా ఇబ్బందిగా ఉండేది. తన మాటల చతురతతో ఆయన అందరినీ ఆకట్టుకునేవారు. కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రాణం విడిచే వరకూ అదే పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యధిక సమయం మంత్రిగా పనిచేసిన అరుదైన రికార్డును రోశయ్య సొంతం చేసుకున్నారు. రోశయ్య రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగారు.

వైశ్య సామాజికవర్గానికి...
కొణిజేటి రోశయ్య 1933 జులై 4వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు జిల్లాలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ విద్యను అభ్యసించారు. తొలిసారి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఆయనకు కేబినెట్ లో చోటు దక్కేది. వైశ్య సామాజికవర్గానికి చెందిన రోశయ్య వివాద రహితుడిగా ఉండేవారు. 1968, 1974, 1980 లలో రోశయ్య ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఏ సీఎం అయినా...
ఏ ముఖ్యమంత్రి అయినా రోశయ్య వారికి అనుకూలంగా నడుచుకునే వారు. ఆర్థికమంత్రిగా ఆయన పదహారు సార్లు బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా అనేక హామీలు ఇస్తున్న సమయంలో ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ఖజానాను సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. రోశయ్యపైనే సీఎంలు ఆధారపడేవారంటే అతిశయోక్తి కాదు.
గాంధీ భవన్ కు రోజూ....
ఇక కాంగ్రెస్ విపక్షంలో ఉన్న సమయంలో ఆయన ప్రతిరోజూ గాంధీభవన్ కు వచ్చేవారు. ఖచ్చితంగా రోశయ్య ప్రెస్ మీట్ ప్రతిరోజూ ఉండేది. రోశయ్య మీడియా సమవేశంపై అనేక ఛతురోక్తులు అప్పట్లో విన్పించేవి. అధికార పార్టీ కూడా రోశయ్య సలహాలను, సూచనలను గౌరవంగా స్వీకరించేది. తమిళనాడు గవర్నర్ గా పదవీ విరమణ చేసిన తర్వాత కొన్నేళ్ల నుంచి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు. రోశయ్య మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక నిబద్దతతో కూడిన రాజకీయ నాయకుడిని కోల్పోయినట్లయింది. రోశయ్య వారసులెవరూ రాజకీయాల్లోకి రాలేదు.


Tags:    

Similar News