వైసీపీలో ఆ ముగ్గురు వీరేనా...?

వచ్చే రెండు నెలల్లో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు జూన్ లో ఖాళీ అవుతున్నాయి

Update: 2022-01-17 08:49 GMT

వచ్చే రెండు నెలల్లోనే రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీకి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు జూన్ లో ఖాళీ అవుతున్నప్పటికి మార్చి నెలలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నాలుగు రాజ్యసభ స్థానాలు వైసీపీకే దక్కుతాయి. ఖాళీ అయ్యే స్థానాల్లో ఒకటే వైసీపీది. మిగిలిన మూడు బీజేపీవే. బీజేపీవి అంటే బీజేపీవి కాదులెండి. ఒరిజనల్ గా తెలుగుదేశం పార్టీకి చెందినవే.

నాలుగు స్థానాలు....
వచ్చే జూన్ నాటికి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలు నాలుగు. విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్. వీరిలో విజయసాయిరెడ్డి పదవీ కాలం మరోసారి జగన్ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆయనకు రెన్యువల్ చేయడంతో రెడ్డి సామాజికవర్గానికి భర్తీ చేసినట్లే. ఇక మూడు స్థానాలు ఎవరికి అన్న చర్చ ఇప్పటి నుంచే పార్టీలో మొదలయింది. ఒకటి ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట.
ఎన్నికలకు సమీపిస్తుండటంతో...
మరొకటి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలన్నది జగన్ అభిప్రాయంగా ఉంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉండటంతో పక్కా సామాజిక సమీకరణాలు పాటించాలని పార్టీ అధినేత ఆలోచన. అందుకే ఇప్పటి నుంచే తమకు దక్కనున్న నాలుగు రాజ్యసభ పదవులపై జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ జగన్ అభిప్రాయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. జగన్ 2019 ఎన్నికలకు ముందు కొందరికి రాజ్యసభ పదవి హామీ ఇచ్చారు. వారందరూ ఇప్పుడు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
కొందరి పేర్లు....
బీసీలు, ఎస్సీ, మైనారిటీలకు ఎమ్మెల్సీ పదవుల్లో జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. వారికే యాభై శాతం ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించారు. రాజ్యసభలో పార్టీకి అన్ని రకాలుగా ఉపయోగపడేవారికి ప్రయారిటీ ఇవ్వాలని కొందరు సీనియర్ నేతలు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కిల్లి కృపారాణికి ఈసారి రాజ్యసభ పదవి ఇస్తారంటున్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేకపోయిన మర్రి రాజశేఖర్ కు కూడా ఈ పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు. ముద్రగడ పద్మనాభం అంగీకరిస్తే ఆయనకు కూడా ఒక పదవి ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. నలుగురిలో ఒకటి విజయసాయిరెడ్డికి ఖాయం కాగా, మిగిలిన ఆ ముగ్గురు ఎవరు? అన్న చర్చ జరుగుతోంది.


Tags:    

Similar News